calender_icon.png 25 June, 2025 | 9:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్యూచర్ సిటీ నగరం కాదు.. భవిష్యత్తు

25-06-2025 12:58:15 AM

ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించండి

  1. ఫ్రెంచ్ కంపెనీలు ఇక్కడికొచ్చేలా చొరవచూపండి
  2. ‘ఇఫ్కీ’ రౌండ్‌టేబుల్ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు 

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాం తి): భావితరాల అవసరాలకు అనుగుణం గా రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం గా నిర్మించబోతున్న ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్స హించాలని ‘ఇండో - ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ(ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. మంగళవారం సచివాలయంలో ఇఫ్కీ  ప్రతినిధుల తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రోత్సాహకాలను వివరించారు. తెలంగాణ బ్రాండ్‌ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్‌రెడ్డి 30 వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని, ఇది ఒక నగరం కాదు.. భవిష్యత్తు అని స్పష్టం చేశారు.

అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే తమ సంకల్పమని వివరించారు. ఏడాదిన్నర వ్యవధిలోనే తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టబడులొచ్చాయని, గతేడాది హైదరాబాద్‌లో 70 జీసీసీలు ప్రారంభమయ్యాయని, పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమన్నారు. పరిశ్రమలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ప్రతిభ గల మానవ వనరులకు కొరత లేదని పేర్కొన్నారు.

మరింత వేగంగా.. సరళంగా.. పార దర్శకంగా అనుమతులిచ్చేందుకు టీజీ-ఐపాస్‌ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏరోస్పేస్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ లాంటి రంగాల్లో పలు ఫ్రెంచి కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయని, సనోఫి, మోనిన్, సఫ్రాన్, క్యాప్ జెమినీ, డసాల్ట్, టెలీ పర్‌ఫార్మెన్స్, ఓపెల్లా హెల్త్ కేర్ లాంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని చెప్పారు.

ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్, ఆగ్రో ఇన్నోవేషన్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్, సస్టునబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో మంచి అవకాశాలున్నాయని వెల్లడించారు. దీన్ని ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని ఇఫ్కీ ప్రతినిధులను కోరారు.

‘తెలంగాణ -- ఫ్రెంచ్’ మధ్య ద్వుపాక్షిక సహకారాన్ని మరింత మెరు గుపర్చేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇఫ్కీ నుంచి యోహాన్ సామ్యూల్, ప్రియాంక్ ప్రకాశ్, నకుల్ దల్వాలా, మోనిన్, ఓపెల్లా హెల్త్ కేర్, సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా, సనోఫీ ఇండియా, టెలి పర్ఫార్మెన్స్, వార్ ఎలక్ట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, జీగ్లర్ ఏరోస్పేస్ తదితర ఫెంచ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని పెట్టుబడులకు ముందుకొచ్చిన ‘సఫ్రాన్’

ఫ్రెంచ్ విమాన ఇంజిన్ల తయారీ సంస్థ సఫ్రాన్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సఫ్రాన్ హైదరాబాద్‌లో ఇప్పటికే రెండు ప్రపంచస్థాయి ఉత్పాదక కేంద్రాలను ఏర్పా టు చేసింది. తాజాగా మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో సఫ్రాన్ జనరల్ మేనేజర్ పియరీ ఫెర్నాండెజ్ కొత్త పెట్టుబడులను ప్రతిపాదించారు.

సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ అనే కొత్త కంపెనీని నెలకొల్పనున్నట్టు వెల్లడించారు. రఫేల్, ఎం-88 ఫైటర్ జెట్ ఇంజిన్ల నిర్వహణ, ఓవర్ హాలింగ్ పనులను సఫ్రాన్ చేపడుతుంది. దీనివల్ల వచ్చే ఏడాది చివరి నాటికి 150 కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. తర్వాత దశల్లో మరో 750 ఉద్యోగాలు వస్తాయి.

రఫేల్ యుద్ధ విమానాల ఇంజిన్లకు కీలక విడిభాగాలను సఫ్రాన్ తయారు చేస్తుంది. ఇక్కడి నుంచే ఇతర దేశాలకు సరఫరా చేస్తుంది. హైదరాబాద్ అతిపెద్ద ఏరోస్పేస్ హబ్‌గా రూపుదిద్దుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి ఫెర్నాండెజ్ మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.