25 March, 2026 | 2:10 AM

ప్రైవేట్ స్కూల్స్‌కు అనుకూలంగా గజ్వేల్ ఎంఈఓ

25-03-2026 12:00 AM

చర్యలు తీసుకోవాలంటూ డీఈఓ శ్రీనివాస్ రెడ్డి వినతి

గజ్వేల్, మార్చి 24: గజ్వేల్ పట్టణంలోని సాయి జీడీఆర్, జీడీఆర్ ప్రైవేట్ పాఠశాలలకు అనుకూలం గా వ్యవహరిస్తున్న ఎంఈఓపై తక్షణ చర్యలు తీసుకోవాలని యు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు తాటికొండ రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం డీఈఓ శ్రీనివాస్ రెడ్డి గారికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో సమానత్వం, పారదర్శకత, న్యాయం ఉండాల్సిన సమయంలో అధికారులే ఒక వర్గానికి మద్దతు ఇవ్వడం విద్యార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరమన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు నియంత్రణ నిబంధనలు ఉన్నప్పటికీ, కొన్ని తగిన మౌలిక వసతులు లేకపోయినా ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. ఆదివారం, సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంఈఓ పాత్ర కీలకమైనదని, అయితే గజ్వేల్ ఎంఈఓ సమస్యలపై సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్నారు.

విద్యను వ్యాపారంగా మార్చే ప్రయత్నాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని, కానీ అధికారులు నియమాలను పక్కనబెట్టి ప్రైవేట్ సంస్థలకు మద్దతు ఇస్తే సాధారణ ప్రజలకు న్యాయం దొరకదన్నారు. గజ్వేల్ ఎంఈఓ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, సాయి జీడీఆర్, జీడీఆర్ పాఠశాలలపై పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించినట్లయితే గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో యుఎస్‌ఎఫ్‌ఐ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నాచారం శేఖర్, కార్యదర్శి గుడికందుల రవి పాల్గొన్నారు.