17-08-2025 02:19:21 PM
మద్నూర్ ఎస్సై విజయ్ కొండ..
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని మద్నూర్ తహశీల్దార్ ఎం.డి. ముజీబ్(Tahsildar M.D. Mujeeb) కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని రైతు వేదికలో గణేశ్ మండపాల సభ్యులతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సై విజయ కొండ మాట్లాడుతూ.. మండలంలోని గణేష్ మండపాలను నిర్వహించేవారు శాంతియుతంగా, సామరస్యంగా నిర్వహించాలని సూచించారు. నిర్వాహకులు పోలీసుల అనుమతి తీసుకొని, పోలీసు అధికారుల నిబంధనలు పాటించాలన్నారు.
మండపంలో ఇద్దరు వ్యక్తులు తప్పకుండా ఉండాలని తెలిపారు. విద్యుత్ సదుపాయం కొరకు తప్పనిసరిగా విద్యుత్ అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవాలలో డీజే సౌండ్ ఉపయోగించరాదని, మద్యం సేవించరాదని, ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు పోలీసు అధికారులకు సహకరించాలని, కలిసిమెలిసి శాంతియుతంగా ఉత్సవాలను జరుపుకోవాలన్నారు.చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల గణేష్ మండప నిర్వాహకులు, గ్రామ పెద్దలు, పోలీసు సిబ్బంది విద్యుత్, అగ్నిమాపక శాఖ తదితరులు పాల్గొన్నారు.