17-08-2025 02:58:15 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ పట్టణ పరిధిలో ఉన్న 365 నేషనల్ హైవే పై సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నర్సంపేట బైపాస్ రోడ్డు నుండి ఇల్లందు బైపాస్ రోడ్డు వరకు శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, మున్సిపాలిటీ సిపిఎం మాజీ ఫ్లోర్ లీడర్ సూర్ణపు సోమయ్య మాట్లాడుతూ, 36వ వార్డు పరిధిలో ఉన్న 365 జాతీయ రహదారిపై సెంట్రల్ లైటింగ్ రెండు నెలలుగా వెలగడం లేదని, దీంతో పాదాచారులు, పట్టణ ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్లపై ఉన్న గుంతలు కటిక చీకట్లో కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వీధి దీపాలు వెలగడం లేదనే అంశంపై అనేక పర్యాయాలు మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారిపై పరిస్థితి ఇలా ఉన్నా కూడా అటు జిల్లా స్థాయి అధికారులు, ఇటు ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతిని స్పందించి సెంట్రల్ లైటింగ్ సిస్టం పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి బానోతు సీతారాం నాయక్, జిల్లా కమిటీ సభ్యుడు సమ్మెట రాజమౌళి, రావుల రాజు, యాకయ్య, భాగ్యమ్మ, నాగన్న, శ్రీనివాస్, వెంకన్న, రజాక్, రమాదేవి, సుధాకర్, శ్రీనివాస్, నరేష్, బాబు, రేఖ, దేవేందర్ పాల్గొన్నారు.