06-01-2026 12:00:00 AM
స్థానికుల్లో తీవ్ర భయాందోళన
పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు, అధికారులు
గ్యాస్ లీకేజీపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా
రాజోల్ నియోజకవర్గం మలికిపురంలో ఘటన
అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్‌లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్జీ సీలో గ్యాస్ లీక్ అవడం తీవ్ర కలకలం రేపిం ది. రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం ఇర్సుమండ గ్రామంలో సోమవా రం ఓఎన్జీసీ చమురు బావి నుంచి భారీ గ్యా స్ లీక్ అయి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. దీంతో ఆ ప్రాంత ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
ఓఎన్జీసీకి చెందిన మోరీ బావి వద్ద ఉన్న గ్యాస్ పైప్‌లైన్ నుంచి ఒక్కసారిగా గ్యాస్ పైకి చిమ్మడంతో మంటలు వ్యాపించాయి. దాదాపు రెండు గంటల పాటు పెద్ద శబ్ధాలతో గ్యాస్ లీక్ అవడంతో గ్రామస్తులు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. గ్యాస్ లీక్ అయి చెలరేగిన మంటలతో సమీపంలోని కొబ్బరి తోట లు దగ్ధమయ్యాయి. దాదాపు 500కు పైగా కొబ్బరి చెట్లు కాలిపోయినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
విషయం తెలుసుకున్న వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారు లు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇరుసుమండ గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చే యించారు. చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాల కు తరలించారు. అలాగే ఓఎన్జీసీ ఉన్నతాధికారులు, సాంకేతిక బృందాలు రాజమండ్రి నుంచి హుటాహుటిన ప్రమాద ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందు కు చర్యలు చేపట్టారు. అధికారులు పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
కాగా ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలుసంభవించలేదని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.దట్టమైన పొగమంచులా వ్యాపించి నివాస ప్రాంతాల్లోకి ప్రవేశించిందని, గ్రామస్తుల్లో భయాన్ని రేకెత్తిస్తోందని నివాసితులు పేర్కొన్నారు.
ప్రాథ మిక సమాచారం ప్రకారం, బావిలో ఉత్పత్తి అకస్మాత్తుగా ఆగిపోయి, వర్క్‌ఓవర్ రిగ్ కార్యకలాపాలు జరుగుతున్నప్పుడు ఈ సం ఘటన జరిగింది. ఈ ప్రక్రియలో, ముడి చమురుతో కలిపిన పెద్ద మొత్తంలో గ్యాస్ పెద్ద ఎత్తున బయటకు వచ్చి, గ్రామం వైపు వేగంగా వ్యాపించిందని తెలుస్తోంది.గ్యాస్ లీక్ కావడానికి గల ఖచ్చితమైన కారణాల, ఏదైనా నష్టం వివరాలు ఇంకా నిర్ధారించబడలేదని అధికారులు తెలిపారు.
పరిస్థితిని సమీక్షిస్తున్నాం: ఓఎన్జీసీ
మోరీణే బావిలో వద్ద ఏర్పడిన గ్యాస్ లీకేజీని, చెలరేగిన మంటలను నివారించడానికి చర్యలు చేపట్టామని ఓఎన్జీసీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రమాద ఘటన తెలియగా నే తమ సంస్థకు చెందిన ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలి పింది. నర్సాపురంతో సహా సమీప ప్రాంతా ల నుంచి అదనపు పరికరాలు తెప్పిస్తున్నామని, ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలే దని, గాయాలు కూడా ఎవరికి కాలేదని ఓఎన్జీసీ ఆ ప్రకటనలో పేర్కొంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా
గ్యాస్ లీకేజీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. పరిస్థితిని సమీక్షించడానికి మంత్రులు అచ్చన్నాయుడు, వాసంశెట్టి సుభాష్‌లతో పాటు సీనియర్ అధికారులతో సీఎం మాట్లాడారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానిక అధికారులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపామని, సహాయ, ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేయాలని మంత్రులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. గ్రామస్తులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ముందుజాగ్రత్తగా సమీప ప్రాంతాల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.ఈ సంఘటన తర్వాత జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఎంపీ గంటి హరీశ్ బాలయోగి, రాజోల్ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, పేలుడు ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. గ్యాస్ లీక్ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు కోనసీమ జిల్లా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడారు.
స్థానికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులను వెంటనే రప్పించాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. స్థానికులు గ్యాస్ పీల్చకుండా మాస్కులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.