05-01-2026 04:56:16 PM
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం నాలుగో రోజుకు కొనసాగనున్నాయి. తెలంగాణ వస్తు, సేవల పన్ను (సవరణ) బిల్లును సోమవారం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్ లోకి వెళ్లి నిరసన తెలిపారు. జీఎస్టీ సవరణ బిల్లుపై మాట్లాడే అవకాశం ఇవ్వండం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ఫ్లోర్ లీడర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.
బిల్లుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, జీఎస్టీ దేశంలో ఏకీకృత పన్ను విధానాన్ని తీసుకువచ్చిందని, తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ వస్తు, సేవల పన్ను (సవరణ) బిల్లును స్వాగతిస్తున్నానని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో గానీ, పార్లమెంటులో గానీ ప్రవేశపెట్టిన బిల్లులను రాజకీయాలకు అతీతంగా చూడాలని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. బిల్లులలో ఏవైనా లోపాలు ఉంటే, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు వాటిని అసెంబ్లీలో లేదా పార్లమెంటులో వివరంగా చర్చించి పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. జీఎస్టీ వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు.