calender_icon.png 9 January, 2026 | 11:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టాల్లో మదర్ డెయిరీ

06-01-2026 12:20:56 AM

  1. అప్పులు తీరకుంటే... చరిత్ర పుటల్లోకి నెలల తరబడి పాల బిల్లులు, జీతాల చెల్లింపులు బంద్ 
  2. ఆందోళనలో 32 వేల మంది పాడి రైతులు, 500 మంది ఉద్యోగులు 
  3. ప్రస్తుతం రూ. 70కోట్లకు పైగా అప్పులు స్థిరాస్తులు విక్రయించాలని గతంలో తీర్మానం ఆమోదం 
  4. తగ్గిన పాల సేకరణ, ఆలయాలకు నిలిచిన పాల ఉత్పత్తులు 
  5. ఆదుకోవాలని నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డుకు వినతి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆదుకోవాలి 

ఎల్బీనగర్, జనవరి 5 : సహకార సమాఖ్యకు స్ఫూర్తినిచ్చిన ’మదర్ డెయిరీ’ ఇప్పుడు నష్టాలతో నెట్టుకొస్తుంది. నష్టాలు, అప్పులు... ఇలాగే కొనసాగితే మదర్ డైయిరీ (ఉమ్మడి నల్గొండ - రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్- (నార్ముల్) ఇక చరిత్రగా మారనున్నది. పాల ఉత్పత్తిదారుల సంఘాలకు ఊపిరి పోసిన మదర్ డెయిరీ ప్రస్తుతం కొనప్రాణంతో ఉన్నది.

డెయిరీని ఉద్దేశపూర్వ కంగానే నష్టాల ఊబిలో ముంచుతున్నారని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అవినీతి, పాలకవర్గాల ఏకపక్ష నిర్ణయాలు, రాజకీయ నాయకులకు పునరావాస కేంద్రంగా మారడంతో మదర్ డెయిరీ నష్టాలు, అప్పుల ఊబీలోకి కూరుకుపోయింది. ’నార్ముల్’ డైరెక్టర్లు కూడా ఉత్సవ విగ్రహాలుగా మారడంతో డెయిరీ డెవలప్మెంట్ కు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

అప్పుల బాధల నుంచి గట్టెక్కించేందుకు నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్టీడీబీ)కి అప్పగించడం లేదా రాష్ట్ర ప్రభుత్వం దత్తతకు తీసుకుంటే తప్పా మదర్ డెయిరీకి మనుగడ ఉంటుంది. డెయిరీ అప్పులు, నష్టాలకు ప్రస్తుత చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి బలిపీఠం ఎక్కనున్నారు. ఆయన్ని చైర్మన్ కుర్చీ నుంచి దించడమే లక్ష్యంగా డైరెక్టర్లు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. 

గతం ఘనం... వర్తమానం దీనస్థితి 

నార్ముల్’ (నల్గొండ - రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార యూనియన్ లిమిటెడ్) దాదాపు 40 ఏండ్లుగా పాడి రైతులకు ఆసరాగా నిలుస్తున్నది. దీని పరిధిలో సుమారు 32 వేల మంది పాడి రైతులు, 432 సొసైటీలు, 42 చిల్లింగ్ కేంద్రాలు ఉన్నాయి. సంస్థలో దాదాపు 500 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. హైదరాబాద్ లోని హయత్ నగర్ లో 72 ఎకరాల విస్తీర్ణంలో మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయం ఉన్నది. నార్ముల్ పదేండ్ల కింద డెయిరీ లాభాల్లోనే నడిచింది. కరోనా సమయంలో రూ.16 కోట్ల అప్పులు అయ్యాయి.

దీని నుంచి గట్టెక్కే సమయంలో డెయిరీలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పాలకవర్గాల నాయకుల అలసత్వంతో డెయిరీ ఆగమాగమైంది. 2023 వరకు రూ.16 కోట్ల అప్పులు ఉండగా.. ప్రస్తుతం రూ. 70 కోట్లకు చేరింది. పాడి సంపదతో సంబంధం లేని వాళ్లు కూడా.. రాజకీయ పదవులుగా భావించి పైసలు పెట్టి పదవుల్లోకి రావడంతో.... డైరెక్టర్లు, మేనేజర్లు అందరూ కేవలం సొంత సంపాదనపైనే దృష్టి పెట్టారు. దీంతో మదర్ డెయిరీ అప్పుల్లో కూరుకు పోయింది. దీనిని కాపాడడానికి నార్మల్ సంస్థకు చెందిన భూములను విక్రయించాలని తీర్మానాలు చేశారు. 

బిల్లులు రాక రైతుల ఆందోళనలు

’నార్ముల్’ దాదాపు 40 ఏండ్లుగా పాడి రైతులకు ఆసరాగా నిలుస్తున్నది. దీని పరిధిలో సుమారు 32 వేల మంది పాడి రైతులు, 432 సొసైటీలు ఉన్నాయి. సంస్థలో దాదాపు 500 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు రైతులకు 8 పాల బిల్లులు రాలేదు. దీంతో రైతులు మదర్ డెయిరీకి పాలు పోయడం భారీగా తగ్గించారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు  ఆందోళనకు దిగుతుండగా.. గతంలో కొందరు వర్కర్లు  ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఉన్నాయి. 

- ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి 

మదర్ డెయిరీని కాపాడాలంటే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు (ఎన్టీడీబీ)కి అప్పగిస్తే.. రైతులకు మేలు జరుగుతుందే తప్పా.. తమకు ప్రాధాన్యం తగ్గుతుందని భావించిన కొందరు డైరెక్టర్లు ఆదిలోనే అడ్డుకుంటున్నారు. పాల సేకరణ పెంచాలంటే రైతులకు పెండింగ్ బకాయిలు చెల్లించి, రైతుల విశ్వాసం పొందాలి. ఆలయాలకు డెయిరీ పాల ఉత్పత్తులను విక్రయించేలా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని డైరెక్టర్లు, రైతులు కోరుతున్నారు.