దూసుకెళ్లిన గౌరవ్
న్యూఢిల్లీ, ఆగస్టు 14: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన దీర్ఘ శ్రేణి గ్లుడైడ్ బాంబ్ గౌరవ్‌ను డీఆర్డీవో మరోసారి విజయవంతంగా పరీక్షించింది. వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఈ బాంబు అత్యంత కచ్చితత్వంతో తాకిందని డీఆర్డీవో ఓ ప్రకటనలో బుధవారం తెలిపింది. అదానీ గ్రూప్ కంపెనీ అయిన అదానీ డిఫెన్స్ ఏరోస్పేస్‌తో కలిసి డీఆర్డీవో దీనిని అభివృద్ధి చేసింది. తుది పరీక్షలు కూడా విజయవంతం కావటంతో దీని ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఇది గేమ్‌చేంజర్ అవుతుందని చెప్తున్నారు. టన్ను బరువుండే ఈ బాంబును సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం ద్వారా ప్రయోగించారు. దీనిని భిన్న రకాల వార్‌హెడ్లలో వాడటానికి వీలున్నది. ఇది క్షిపణి కాకపోయినా క్షిపణిలాగే నిర్దేశిత లక్ష్యాన్ని తాకగలదు. జీపీఎస్ ఆధారంగా ఇది ప్రయాణిస్తుంది. పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు డీఆర్డీవోను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.




