20-03-2025 12:00:00 AM
దాదాపు రెండు నెలల పాటు ప్రశాంతంగా ఉన్న గాజా ప్రాంతం మళ్లీ నెత్తురోడుతోంది. గత జనవరిలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించడానికి హమాస్ అంగీకరించడం లేదన్న సాకుతో రెండు రోజుల క్రితం హమాస్ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంపై బాంబు ల దాడులతో విరుచుకు పడింది. ఈ దాడుల్లో 400 మందికి పైగానే చనిపోయినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ప్రాణనష్టం ఇంకా ఎక్కువే ఉండొచ్చని అంటున్నారు.
తమ బందీలను విడిచిపెట్టడానికి హమాస్ పదేపదే నిరాకరిస్తున్నందుకు, అమెరికా చేసిన కొత్త ప్రతిపాదనలను అంగీకరించనందు కు కఠిన చర్యలు తీసుకోవలసిందిగా తమ బలగాలను ఆదేశించినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెబుతున్నారు. జనవరిలో కాల్పు విరమణ అమలులోకి వచ్చిన తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులు కొనసాగించిందని, 140 మందికి పైగా చనిపోయినట్లు హమాస్ ఆరోపిస్తోంది.
మరోవైపు హమాస్‌ను లొంగదీసుకోవడానికి ఇజ్రాయెల్ ఆహారాన్ని ఆయుధంగా చేసుకొంటోంది. కాల్పుల విరమణ సమయంలో కొనసాగిన మానవతా సాయాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిం ది. దీనిపై భారత్‌తో పాటుగా ప్రపంచ దేశాలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. మానవతా సాయం కొనసాగిస్తుండడంతో గాజాను వీడిన చాలా మంది తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు.
శాశ్వత కాల్పుల విరమణకు ఇజ్రాయెల్‌హమాస్ చర్చలు దారి తీస్తాయని వారంతా ఆశించారు. కానీ ఇప్పుడు మానవతా సాయం నిలిచిపోవడంతో పాటుగా భీకర దాడులు కొనసాగడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. నెలల తరబడి అమెరికా, ఖతార్, ఈజిప్టు దేశాల మధ్యవర్తిత్వం కారణంగా జనవరి 19 నాటి కాల్పుల విరమణ సాధ్యమయింది. కాల్పల విరమణపై ఎలా ముందుకు సాగాలనే దానిపై మూడు దశల ప్రణాళికను కూడా రూపొందించారు.
రెండో దశ చర్చల్లో హమాస్ మిగిలిన బందీలందరినీ విడుదల చేయడంతో పాటుగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంనుంచి పూర్తిగా వైదొలిగే అంశాలను చేర్చాలని, తద్వారా శాశ్వత శాంతికి బాట వేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి కూడా. మొదటిదశ కాల్పు ల విరమణ మార్చి 1న ముగిసిన్పటికీ రెండో దశకు సంబంధించి చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించ లేదు.
దీంతో ఇజ్రాయెల్ గాజాలోకి ప్రవేశించే మానవతా సాయాన్ని పూర్తిగా నిలిపివేసింది. అలాగే అమెరికా కొత్త ప్రతిపాదనను తాము సమర్థిస్తున్నామని ప్రకటించింది. రెండోదశ కాల్పుల విరమణపై చర్చించడానికి ఇజ్రాయెల్, హమాస్ బృందాలు గతవారం ఖతార్‌లో సమావేశమయ్యాయి. ఈ సమావేశంలోనే అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు.
హమాస్ మరింతమంది బందీలను విడుదల చేయాలని, దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తుందని, అయితే శాశ్వత యుద్ధ విరమణకు సంబంధించిన చర్చలు మాత్రం ఆలస్యమవుతాయనేది ఆ ప్రతిపాదన సారాంశం.
ఇదే కాల్పుల విరమణ చర్చలు విఫలం కావడానికి కారణం. హమాస్ చెరలో ఉన్న బందీలనందరినీ విడిపించడంతో పాటుగా దాన్ని ఓడించడం ఇజ్రాయెల్ ప్రధాన లక్ష్యాలు ఎందుకంటే ముందు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం గాజా ప్రాంతంనుంచి ఇజ్రాయెల్ సైన్యాలు వైదొలిగితే తప్ప బందీలను విడిచిపెట్టబోమని హమాస్ తాజా చర్చల సందర్భంగా స్పష్టం చేసింది.
అయితే రాజీకి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ బైటికి చెప్తున్నాకొత్త డిమాండ్లు పెడుతోందని విట్కాఫ్ ఆరోపించారు. 17 రోజులుగా చర్చలను నిలిపివేయడం ద్వారా హమాస్‌ను కొత్త రాయితీలకు ఒప్పించాలనేది ఇజ్రాయెల్ ఎత్తుగడగా కనిపిస్తోంది.
మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని తీరుపై దేశంలో వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతుండడం ఆయనను మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో గాజా ప్రాంతం మరో సారి నిప్పుల గుండంగా మారుతుందా లేక శాశ్వత శాంతి పవనాలు వీస్తాయా అనేది చూడాలి.