26 July, 2026 | 2:13 AM

జెన్ జీ విక్టరీ!

26-07-2026 12:00 AM

విద్యావ్యవస్థలో లోపాలు, నీట్ పేపర్ లీక్, ఉద్యోగ నియామకాల్లో అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వలో దేశ యువత నెల రోజులపాటు చేసిన పోరాటం మొత్తానికి ఫలించింది. ఒకవైపు సామాజికవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేయడం, మరోవైపు యువత ఉక్కు సంకల్పాన్ని ప్రదర్శించడం, ప్రతిపక్షాలు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు, ప్రముఖులు వారికి తోడవడంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.

దేశ యువత డిమాండ్‌కు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించింది. దాంతోపాటు నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, యువతపై నమోదైన కేసుల ఎత్తివేత వంటి ఇతర డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం ముదావహం.

సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేయడం, ఆలస్యంగానైనా ప్రతిపక్షాలు కార్యరంగంలోకి దిగినప్పటికీ, ఇది ముమ్మాటికీ మీమ్స్, వ్యంగ్యాన్ని కలగలిపి నిరసనలకు సృజనాత్మకతను జోడించిన జెన్ జీ యువత సాధించిన మహత్తర విజయమని చెప్పక తప్పదు. ఎలాంటి హింసకు తావులేకుండా, రాజ్యాంగబద్ధంగా, ఐక్యమత్యంతో యువత చేసిన ఈ ఉద్యమం ప్రజాస్వామ్యంలో శాంతియుత పోరాటాలకు ఉన్న శక్తిని మరోసారి చాటిచెప్పింది.

తద్వారా హక్కుల కోసం పోరాడితే ప్రభుత్వాలు దిగిరాక తప్పదనే సందేశాన్ని యువత ప్రజల్లోకి తీసుకెళ్లింది. జెన్ జీ సాధించిన ఈ గెలుపు భవిష్యత్తు ప్రజాపోరాటాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాతోనే అన్ని సమస్యలు సమసిపోతాయని భావించడం పొరపాటే అవుతుంది. పేపర్ లీకులతోపాటు దేశ విద్యావ్యవస్థలో అనేక వ్యవస్థాగత లోపాలు ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ప్రశ్నాపత్రాల లీకులను పూర్తిగా అరికట్టడంతోపాటు పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం, నియామకాల్లో అవినీతికి అడ్డుకట్టవేయడం, ఉపాధి కల్పన వంటి లక్ష్యాలను సాధించినప్పుడే యువత పోరాటం పూర్తిస్థాయిలో ఫలించినట్టు భావించాలి. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలి.

హామీ ఇచ్చినట్టుగా విద్యార్థుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు దీర్ఘకాలిక సంస్కరణలు చేపట్టాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రభుత్వంపైనే ఉన్నది. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమేనని చెప్పిన కాక్రోచ్ జనతా పార్టీ, దేశ యువత ఈ లక్ష్య సాధన దిశగా ఎంతవరకు పోరాడుతుందో చూడాలి.