నిత్య చైతన్య స్ఫూర్తి కలాం
రేపు కలాం వర్ధంతి :
‘లీడ్ ఇండియా’ అంటూ యువతను దేశాభివృద్ధి మహాయజ్ఞంలో పాలుపంచుకోవాలని పిలుపు ఇచ్చిన ఏపీజే అబ్దుల్ కలాం భరతమాత ముద్దుబిడ్డగా జాతి గౌరవాన్ని అంతర్జాతీయ వేదికల మీద చాటిచెప్పిన అనన్య సామాన్యడు, మేరునగ ధీరుడు. భారత 11వ రాష్ట్రపతిగా విశిష్ట సేవలందిం చి ‘పీపుల్స్ ప్రెసిడెంట్’గా ప్రజల గుండెల్లో చెరగని ముద్రను వేసిన కలాం 15 అక్టోబర్ 1931న రామేశ్వరంలో ఆశియమ్మ-జైనులబ్దీన్ దంపతులకు జన్మించారు.
రామేశ్వరంలో పాఠశాల విద్య, తిరుచురాపల్లి సెయింట్ జోసెఫ్ కాలేజీలో భౌతిక శాస్త్రం, మద్రాస్ ఎంఐటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పట్టా లు పొందారు. విద్యార్థి దశ నుంచి అసాధారణ మేధావిగా కలాం ఎదిగిన క్రమం విలక్షణం. నాలుగు దశాబ్దాల ఉద్యోగపర్వంలో ఏరోస్పేస్ సైంటిస్ట్‌గా సేవలందించే క్రమంలో డీఆర్డీవో, ఇస్రో సంస్థల్లో పరిపాలనాదక్షుడిగా, మిలటరీ మిస్సైల్ రూపశిల్పిగా సత్తా చాటి ‘మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ గా కీర్తిప్రతిష్టలు గడించారు.
ప్రధాని ముఖ్య వైజ్ఞానిక శాస్త్ర సలహాదారుగా, డీఆర్డీవెఓ సెక్రటరీగా 1992 నుంచి 1999 వరకు పనిచేశారు. స్వావలంభన దిశగా భారతదేశాన్ని న్యూక్లియర్ ఎనర్జీ కలిగిన దేశంగా నిలపటానికి 1998 లో పోఖ్రాన్--2 పరీక్షలను పర్యవేక్షించి ప్రజలతో జేజేలు అందుకున్నారు. ఇంజినీర్, సైంటిస్ట్, రచయిత, ఆచార్యులు, యువత ఆరాధ్య దైవం, ఆదర్శ రాజకీయవేత్త, యువతకు మార్గదర్శిగా బహుముఖీన ప్రతిభ కలిగిన అబ్దుల్ కలాం బోధనలు అనితరసాధ్యాలు.
‘ఉన్నత కలలు కనండి, సాకారానికి కఠోర సాధన చేయండి’ అంటూ నినదించిన కలాం జీవితం తెరిచిన పుస్తకం, యువతకు మార్గదర్శకం. కలాం పేపర్ బాయ్‌గా పని చేస్తూ, ఏరోస్పే స్ ఇంజినీరింగ్ పూర్తి చేయగలగడం నేటి యువత కు ప్రేరణాత్మకం. ఉద్యోగిగా తన సీనియర్లు విక్రమ్ సారాభాయ్, ఆచార్య సతీష్ ధవన్, బ్రహ్మ ప్రకాశ్ లాంటి దిగ్గజాల వద్ద నాయకత్వ పటిమను, అంతరిక్ష శాసాంకేతిక మెలకువలను నేర్చుకున్నారు.
1969లో ఇస్రోకు బదిలీ అయిన కలాం నేతత్వంలో భారత తొలి స్వదేశీ పరిజ్ఞానంతో శాటిలైట్ లాంచింగ్ వెహకిల్‌ని రూపొందించుటలో ఇస్రో విజయం సాధించింది. 1970- మధ్య పీఎస్‌ఎల్వీతో పాటుగా ఎస్‌ఎల్వీ అభివృద్ధి చేయుటలో ప్రధాన భూమికను నిర్వహించారు. ‘బాలిస్టిక్ మిస్సైల్’ టెక్నాలజీతో ‘ప్రాజెక్ట్ డెవిల్’, ‘ప్రాజెక్ట్ వాలియంట్’లను రూపొందించడంలో మార్గదర్శనం చేశారు. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా కలాం చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పరిశోధనలు కొనసాగించారు.
‘అగ్ని’, ‘పథ్వి’ మిస్సైళ్లను విజయవంతంగా నిర్మించగలిగారు. 1998లో చవకైన ‘కలాం--రాజు కరోనరీ స్టంట్’ను, 2012లో ‘కలాం-రాజు టాబ్లెట్’ హెల్త్‌కేర్ కంప్యూటర్‌ను రూపొందించారు. టెక్నాలజీ సహాయంతో ఆర్థిక, వ్యవసాయ, ఆరోగ్య, విద్యారంగాలను పరిపుష్టం చేయవచ్చని గట్టిగా నమ్మిన కలాం ముందు చూపు అద్వితీయం. ‘జననం సాధారణమే కావచ్చు, మరణం మా త్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి’ అని ఆయన ఉద్బోధించారు.
25 జూలై 2002న రాష్ట్రపతి పదవిని చేపట్టిన కలాం ‘ప్రజా రాష్ట్రపతి’ గా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన అనంతరం ‘లీడ్ ఇండియా-2020’ ఉద్యమాన్ని ప్రారంభించి ఐదేళ్లలో 5 లక్షల మంది యువతకు మార్గదర్శకం చేయాలనే లక్ష్యాన్ని ఛేదించుటకు కలాం కృషి చేశారు. నేటికీ కలాం స్థాపించిన ‘లీడ్ ఇండియా ఫౌండేషన్’ ఉద్యమా న్ని తన అభిమానులు ‘లీడ్ ఇండియా నేషనల్ క్లబ్స్’ వేదికగా యువతను సన్మార్గంలో నిలిపే పలు అసమాన్య సేవలను కొనసాగించడం హర్షదాయకం.
అనేక అగ్ర విద్యాసంస్థలు ఐఐఎం, ఐఐఎస్సీ, ఐఐఐటీ, బీహెచ్‌యూ, అన్నా విశ్వవిద్యాలయాలకు విజిటింగ్ ఫ్రొఫెసర్‌గా కలాం అమూల్యమైన సేవలందించారు. భారతరత్న సహా అనేక అవార్డులను కలాం అందుకున్నారు. తన అనుభవాలను, ఆలోచనలను భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశంతో ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’, ‘ఇండియా--2020’, ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ లాంటి పలు పుస్తకాలు రచించారు. 26 జూలై 2015న ఐఐఎం, షిల్లాంగ్‌లో విద్యార్థులతో ముచ్చటిస్తూనే తుది శ్వాస విడిచిన కలాం జీవితం అనుసరణీయం, సదా స్మరణీయం.
డా.బుర్ర మధుసూదన్‌రెడ్డి
వ్యాసకర్త సెల్: 9949700037






