జియోటెక్నికల్ విచారణ తప్పనిసరి చేయాలి
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): నిర్మాణాలను నియంత్రించే ప్రభుత్వ విభాగాలు, మున్సిపల్ సంస్థలు జియోటెక్నికల్ విచారణను తప్పనిసరి చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేస్తే నిర్మించే భవనాల భద్రత, ఆయుష్షు గణనీయంగా పెరుగుతాయని, ఇది అత్యవసమరన్నారు. శుక్రవారం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్‌లో నిర్వహించిన ఇంపార్టెన్స్ ఆఫ్ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్ అండ్ రికమండేషన్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రస్తుతం ప్రపంచం యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటుందని, క్షిపణులు భవనాలను ధ్వంసం చేస్తున్నాయని, ఇవి భవిష్యత్తులో నిర్మాణ రంగంలో పెద్ద మార్పులకు దారితీస్తాయన్నారు. ఇంధన రంగంలో పెట్రోల్, డీజిల్ స్థానంలో హైడ్రోజన్, ఎలక్ట్రికల్, సోలార్ వంటి ప్రత్యామ్నాయ మార్పులు వస్తాయని, అలాగే నిర్మాణ రంగంలోనూ భవనాలు మరింత బలంగా, ఏ విపత్తునైనా తట్టుకునేలా నిర్మించబడతాయన్నారు. కాబట్టి నిర్మాణ రంగానికి చెందిన ప్రతి ఇంజినీర్, అధికారి సంస్థ జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్‌ను అత్యంత ప్రాముఖ్యంగా తీసుకోవాలని రాంచందర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.




