16 July, 2026 | 8:56 AM

కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడాలి!

23-04-2024 12:05 AM

ఆమె ఓ మామూలు విద్యార్థిని. తన ఆశయం తనకంటే వందరెట్లు పెద్దది. కానీ చిన్నతనంలోనే లక్ష్యం ఉన్న చోట కష్టం ఉంటుందని గ్రహించింది. తన లక్ష్యం కోసం మరింత కష్టపడతాను అంటూ ముందుకెళ్ళింది. లక్ష్యం ఉన్న చోట సవాళ్ళు కూడా ఉంటాయి. వాటికి సరియైన జవాబు చెప్పి వెనక్కి పంపించాలి. ఆ సవాళ్ళను ఎదుర్కొవాలి. భయాలను పాతరెయ్యాలి. అప్పుడే మనం వెళ్ళే దారి తివాచిలా ఉంటుందని అంటున్నారు ఏడీజీగా విధులు నిర్వహిస్తున్న శిఖా గోయల్. తన 27 ఏళ్ల సర్వీసులో ఎన్నో బాధ్యతలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారామె. సక్సెస్‌కు సరియైన చిరునామాగా పేరు తెచ్చుకున్న శిఖా గోయల్ జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు..! 

ఐపీఎస్ కావడానికి బలమైన కారణం ఏమైన ఉందా? 

నా ప్రయాణం అంత ఈజీగా ఏం సాగలేదు. కష్టపడి చదివి మేధావిగా మారిన విద్యార్థి కథనం లాంటిదైతే కాదని చెప్పగలను. నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను చాలా అవుట్ స్టాండింగ్ విద్యార్థిని మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఐపీఎస్‌లో చేరి సేవ చేయాలనేది నా కల. మొదట్లో ఈ కల  చాలా భయంకరంగా అనిపించింది. ఎందుకంటే  ఇది నా స్వభావానికి చాలా విరుద్ధం. నేను చాలా సున్నితమైన వ్యక్తిని. నా కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడటానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాను. మరీ ముఖ్యంగా ప్రజల మధ్యలో ఉండి వారికి సేవ చేయడంలో పోలీసు వృత్తి చాలా కీలకమైనదిగా అనిపించింది. అందువల్లే దీన్ని ఎంచుకున్నాను. ఇది కేవలం కష్టపడి చదవడం మాత్రమే కాదు నన్ను నేను మలుచుకోవడం, రాబోయే సవాళ్లను స్వీకరించడం వంటిది. 

మిమ్మల్ని ప్రోత్సహించే వారిలో మొదటి వ్యక్తి ఎవరు?

నా జర్నీలో మా తల్లిదండ్రుల నుంచి కాలేజీ యాజమాన్యం వరకు అందరు సపోర్టుగా ఉన్నారని చెప్పాలి. ముఖ్యంగా నాన్న సర్వీసులో చేరమని చాలా ప్రోత్సహించారు. జండర్‌పరమైన వివక్ష నాకు సంకెళ్ళు కాకూడదని, నా కెరీర్ అనేది నా ఆకాంక్షలకు దోహదపడాలని నాన్న ఎప్పుడు చెప్పేవారు. ప్రస్తుతం నా భర్త, పిల్లలు నాకు పెద్ద సపోర్టు, వాళ్ళే నా  బలం కూడా. పోలీసు డ్రెస్‌లో సమాజానికి సేవ చేసే అవకాశం రావడం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. 

ఉమెన్ ఆఫీసర్స్ చాలామంది ఐఏఎస్ ఎంచుకుంటారు. కానీ మీరు ఐపీఎస్ ఎంచుకోవడానికి కారణం?

నాకు ఐపీఎస్ కావాలనే కోరిక చిన్నతనం నుంచే ఉంది. ఇది ఓ ప్రత్యేకమైన వృత్తిగా భావిస్తాను. ముఖ్యంగా ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయడం అనేది సవాలుగా స్వీకరించాను. ప్రజలకు సేవ చేయడంలో ఇదొక మంచి అవకాశం. ప్రజలు ఆపద వస్తే పోలీసులను ఆశ్రయిస్తారు. వారికి అవసరమైనప్పుడు నా మద్దతు ఇవ్వడానికి తక్షణమే అందుబాటులో ఉండాలనుకుంటాను. ఢిల్లీ మెట్రో సెక్యూరిటీ ఫోర్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో మహిళా అధికారులకు ఫిలిప్పీన్స్‌కు సంబంధించిన పెకిటి అనే యుద్ధ కళను నేర్పించాను. ఈ యుద్ధ కళలో ఆయుధాన్ని ఉపయోగించకుండా కేవలం రోజువారీ జీవితంలో ఉపయోగించే వస్తువుల సహాయంతో పోరాడటానికి సహాయపడుతుంది. అది నాకు చాలా సంతోషాన్ని కలిగించిన అనుభవం. 

ఐఎఫ్‌ఎస్, ఐపీఎస్ అధికారిగా మీ అనుభవం?

ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బోటనీలో నా ఎంఫిల్ పూర్తి చేసిన తర్వాత యూపీఎస్సీకి కూడా హాజరయ్యాను. మొదటి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసుకి ఎంపికయ్యాను. కొద్దికాలం పాటు ఫారెస్ట్ ఆఫీసర్‌గా కూడా పనిచేశాను. ఆ క్రమంలోనే ఐపీఎస్‌గా అవకాశం రావడం నా అదృష్టంగా భావించాను. ఇక ఐఎఫ్‌ఎస్ కంటే ఐపీఎస్ అనేది భిన్నంగా ఉంటుంది. ఈ రెండింటిని పోల్చలేం. రెండు సేవలకు వాటి స్వంత స్వాభావిక లక్షణాలను కలిగి ఉంటాయి.  

ఆల్ ఇండియా సర్వీస్‌లో అమ్మాయిల శాతం చాలా తక్కువ. ఈ విషయంలో అమ్మాయిలకు మీరిచ్చే సలహా ఏంటి? 

ఒకప్పుడు మంచి జీతంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు  అనే కోరిక ఉండేది. అయితే మన సమాజం గత రెండు దశాబ్దాలలో సానుకూల పరివర్తనకు గురైంది. ఇప్పుడు బలమైన ఆర్థిక కేంద్రంగా ఉంది. అందువల్ల అన్ని ప్రధానమైన పెద్ద పెద్ద ఉపాధి అవకాశాల్లో మహిళల సంఖ్య, వారి నిష్పత్తి క్రమంగా పెరుగుతున్నట్లు చూడవచ్చు. ఆల్ ఇండియా సర్వీసెస్‌లోకి మహిళలను తీసుకోవడం 1951లో ప్రారంభమైంది. కానీ అప్పటి నుంచి క్రమంగా పెరుగుతు వచ్చింది. ప్రస్తుతం బ్యాచ్‌లో దాదాపు 34శాతం మంది మహిళలు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా భవిష్యత్‌లో పెరిగే అవకాశం ఉంది కూడా. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అనేదే నా కోరిక. ఎంతకష్టమైన ఎంచుకున్న రంగంలో ముందుకెళ్లడమే ప్రధాన లక్ష్యం అని నిర్ణయించుకోవాలి. 

 రైడ్ మానిటరింగ్ యాప్ పనితనం, ప్రజల్లో దాని పట్ల స్పందన ఎలా ఉంది?  

తెలంగాణ పోలీసుల ద్వారా ట్రావెల్ సేఫ్(టి సేవ ప్రయాణికుల భద్రతను కాపాడాలనే లక్ష్యంతో ఏర్పాటు చేశాం. ప్రత్యేకించి ఒంటరిగా ప్రయాణించే మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలు ముఖ్యంగా భద్రత కోసం ట్రావెల్ సేఫ్ యాప్ లేదా హెల్ప్ లైన్ 100కి డయల్ చేసుకోవచ్చు. టి సేఫ్ ఒక నెల కిందటే ప్రారంభించినప్పటికీ దాదాపు 10,000 మంది ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించాం ఈ యాప్ ద్వారా. పోలీసులు వ్యక్తుల ప్రయాణాన్ని ట్రాక్ చేస్తు  ఉంటారు. వారివైపు నుంచి ప్రతి స్పందన లేని సమయాల్లో వెంటనే అలర్ట్ అయి సహాయాన్ని అందిస్తాం. ఈ టి సేఫ్ యాప్‌కు సానుకూల స్పందన లభించింది. 

సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? 

అందరిలాగే నా కెరీర్‌లో కూడా వివిధ పరిస్థితులను ఎదుర్కొన్నాను. పోలీసింగ్ అనేది డైనమిక్ ఫీల్డ్. ఈ వృత్తిలో సీనియర్ అధికారులను, ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను అనుసంధానించుకుంటూ పని చేయడం అంత ఈజీ ఏమీ కాదు. పనిలో భిన్న అభిప్రాయాలు, ఒత్తిళ్లు సహజమే. నా కెరీర్ అనుభవంతో చిత్తశుద్దిగా అధిగమించాను. సమాజ నమ్మకాన్ని నిలబెట్టడం, నిష్పక్షపాతంగా సేవ చేయడమనేది నా ప్రధాన సూత్రం. పోలీసు అధికారులు పక్షపాతం లేకుండా చట్టాన్ని గౌరవించడం చాలా అవసరం. 

సైబర్ హెల్ప్‌లైన్ 1930 పనితీరు ఎలా ఉంది?

తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో 1930 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణలో పెరుగుతున్న సైబర్ నేరాలు తగ్గించడంలో ఇది కీలకపాత్ర పోషించింది. ఇప్పటి వరకు సైబర్ నేరాలకు సంబంధించి మాకు 1,50,000 కాల్స్ వచ్చాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రజల్లో అవగాహన పెరిగిందని. ఫిరాద్యుల విషయంలో దాదాపు 85 వేలకు పైగా వచ్చాయి. మనం ఇప్పటి వరకు 6 కోట్లకు పైగా సైబర్ క్రైమ్ బాధితులను సేవ్ చేశాం. అలాగే 14 కోట్లకు పైగా డబ్బును బాధితులకు తిరిగి చెల్లించేలా చూశాం. 

 సైబర్ క్రైమ్‌కు అందుతున్న మొదటి ఐదు ఫిర్యాదులు ఏమిటి?

మొదటి ఐదు ఫిర్యాదులను ప్రమాణికంగా చూస్తే.. ఒకటి పెట్టుబడి మోసం, రెండోది ఐపీవో మోసం, మూడోది లైంగిక హింస, నాలుగోది బ్లాక్ మెయిల్, ఐదోది ఫెడెక్స్ అనే కొరియర్  సంస్థకు చెందినది. క్విక్ స్కామ్‌ల బారిన పడొద్దని, కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకోవద్దని పౌరులకు మీ పత్రిక ద్వారా హెచ్చరిస్తున్నాను. అనుమానిత లింక్‌లపై క్లిక్ చేయకుండా అలాగే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను.   

నా ప్రయాణం అంత ఈజీగా ఏం సాగలేదు. కష్టపడి చదివి మేధావిగా మారిన విద్యార్థి కథనం లాంటిదైతే కాదని చెప్పగలను. నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నేను చాలా అవుట్ స్టాండింగ్ విద్యార్థిని మాత్రం కాదని ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఐపీఎస్‌లో చేరి సేవ చేయాలనేది నా కల. మొదట్లో ఈ కల  చాలా భయంకరంగా అనిపించింది. ఎందుకంటే నా స్వభావానికి చాలా విరుద్ధం. నేను చాలా సున్నితమైన వ్యక్తిని. నా కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడటానికి ఇదే మంచి అవకాశం అనుకున్నాను. 

 రూప