4 April, 2026 | 8:49 PM

సీఎం అండగా ఉన్నారు.. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లోకి

19-09-2025 01:24 PM

హైదరాబాద్: స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గ(Station Ghanpur) అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి వెళ్తున్నామని హనుమకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiyam Srihari) వెల్లడించారు. స్టేషన్‌ ఘనపూర్‌లో అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) అండగా ఉన్నారని సూచించారు. దేవాదుల ఎత్తిపోతల ద్వారా మాకు ప్రయోజనం ఉంటుందని సీఎంకు చెప్పామని కడియం వెల్లడించారు. దేవాదుల కాలువలు బాగుచేయాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు.స్టేషన్ ఘన్ పూర్ నుంచి నవాజ్ పేట వరకు రూ. 148 కోట్ల మంజూరు చేశారని పేర్కొన్నారు. కాలువల్లో పూడిక తీసేందుకు నిధులు ఇచ్చి మా రైతులను సీఎం ఆదుకున్నారని చెప్పారు.

లింగాల గణపురం మండలంలోని అన్ని గ్రామాలకు గోదావరి నీరు వస్తోందని సూచించారు. గణపురం రిజర్వాయర్ నుంచి నవాజ్ పేట వరకు గోదావరి నీళ్లు వస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి సహకారం వల్లే అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ప్రజలతోనే ఉంటా.. ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పారు. కేసీఆర్ 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. చేర్చుకున్న వారిలో ఇద్దరిని మంత్రులను కూడా చేశారు. అప్పుడు బీఆర్ఎస్ లో చేరిన వారెవరూ రాజీనామా చేయలేదని చెప్పిన కడియం బీఆర్ఎస్ అగ్రనేతలకు ఇప్పుడే విలువలు గుర్తుకొచ్చాయా? అని  ఆయన ప్రశ్నించారు. సభాపతి నోటీసులు ఇచ్చారని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కడియం వెల్లడించారు. అటు కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు పోస్ట్‌ కార్డు ఉద్యమం చేపట్టారు. మున్సిపాలిటీ బీఆర్‌ఎస్‌ కన్వీనర్‌ కనకం గణేశ్‌ ఆధ్వర్యంలో కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ ఆయన ఇంటి అడ్రస్‌కు బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు పోస్టు కార్డులు పంపించారు. దీంతో కడియం రాజీనామా ఉత్తరం కలకలం రేపింది.