5 March, 2026 | 2:57 AM

పామాయిల్, డాల్డాతో కల్తీ నెయ్యి

05-03-2026 01:25 AM
  1. బంజారాహిల్స్‌లో ‘ప్రైడ్ డెయిరీ’ తయారీ

రూ.18.26 లక్షల విలువైన కల్తీ నెయ్యి, ముడిసరుకు, యంత్రాల సీజ్

డెయిరీ యజమాని జునైద్ హుస్సేన్ అరెస్ట్

హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి)/బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లో భారీ కల్తీ నెయ్యి తయారీ కేంద్రం గుట్టును హైదరాబాద్ సిటీ పోలీసులు రట్టుచేశారు. బంజారాహి ల్స్ పరిధిలోని భోలానగర్‌లో అక్రమంగా నిర్వహిస్తున్న ‘ప్రైడ్ డెయిరీ’పై కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్ గోల్కొండ టీమ్, మాసబ్‌ట్యాంక్ పోలీసులు బుధవారం సంయుక్తంగా మెరుపుదాడి చేసి కల్తీ నెయ్యిని పట్టుకున్నారు.

డెయిరీ యజమాని  జునైద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని భోలానగర్‌కు చెందిన మొహమ్మద్ జునైద్ హుస్సేన్ (26) ‘ప్రైడ్ డెయిరీ’ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. డెయిరీ నిర్వహణకు అధికారికంగా లైసెన్స్ పొంది.. దాన్ని అడ్డుపెట్టుకుని అత డు అక్రమ సంపాదనకు తెరలేపాడు. తక్కు వ నాణ్యత కలిగిన పామ్ ఆయిల్, వనస్పతి రుచి గోల్ డాల్డా, ఇతర హానికరమైన రసాయనాలను ఆవు, గేదె మీగడతో కలిపి కల్తీ నెయ్యిని తయారుచేస్తున్నాడు.

దీన్ని అచ్చం అసలైన నెయ్యిగా నమ్మిస్తూ.. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో నగరంలోని పలు హోట ళ్లకు, ఫంక్షన్ హాళ్లకు, శుభకార్యాల నిర్వాహకులకు విక్రయిస్తున్నాడు. ఇతని దందాపై పక్కా సమాచారం అందుకున్న గోల్కొండ టాస్క్‌ఫోర్స్, మాసబ్ ట్యాంక్ పోలీసులు ఆ డెయిరీపై దాడి చేసి జునైద్ హుస్సేన్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తయారీ కేంద్రంలో ఉన్న సుమారు రూ.18.26 లక్షల విలువైన 460 కిలోల కల్తీ నెయ్యి, 70 కిలోల కల్తీ మిశ్రమ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీకి విరివిగా వినియోగిస్తున్న 2,090 కిలోల ఆవు మీగడ, 1,170 కిలోల గేదె మీగడ పట్టుబడింది.

28 డబ్బాల రుచి గోల్డ్ డాల్డా తలా 15 కిలోలు, పెద్ద ఎత్తున పామాయిల్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి తయారీకి ఉపయోగి స్తున్న రెండు భారీ బాయిలర్లు, పుషింగ్ మిషన్, ప్యాకింగ్ మిషన్, రెండు తూకపు వేయింగ్ మిషన్లు, 4 వాణిజ్య గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. నెయ్యి నిల్వ ఉంచే సుమారు 70 రకాల చిన్న, పెద్ద బేసన్లు, ఖాళీ డ్రమ్ములు, బ్రాండెడ్ ప్యాకింగ్ కవర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జునైద్ హుస్సేన్‌పై మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ  ఆపరేష న్‌ను హైదరాబాద్ సిటీ అడిషనల్ డీసీపీ టాస్క్‌ఫోర్స్ అందె శ్రీనివాసరావు పర్యవేక్షణలో.. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పె క్టర్ ఆర్ వెంకటేష్, మాసబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సైలు విజయానంద్, చందన సిబ్బంది నిర్వహించారు.