calender_icon.png 18 November, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిన్నింగ్ మిల్లులు బంద్

18-11-2025 12:32:57 AM

  1. నిలిచిన పత్తి కొనుగోళ్లు 
  2. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి రైతుల ఆందోళన 
  3. సీసీఐ పెట్టిన నిబంధనలు సడలించాలని డిమాండ్ 
  4. కేంద్ర జౌళిశాఖ అధికారులతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్
  5. వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 
  6. జిన్నింగ్ మిల్లులు బంద్‌ను ఉపసంహరించుకోవాలని తుమ్మల వినతి

హైదరాబాద్/ఆదిలాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) నిబంధనలను నిరసిస్తూ సోమవారం నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్‌ను పాటిస్తున్నాయి. బంద్ మొదటి రోజు సంపూర్ణంగా ముగిసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సీసీఐతో పాటు ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా అమలు చేస్తున్న నిబంధనలను జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

పత్తిని సీసీఐ కొనుగోలు చేసిన ప్పటికి.. దూది నుంచి గింజలను వేరు చేసి బేళ్లుగా మార్చేందుకు ప్రయివేటు జిన్నింగ్ మిల్లులను లీజుకు తీసుకుంటుంది. కొనుగోలు చేసిన పత్తి కేటాయింపులో గతంలో ఎలాంటి నిబంధనలు ఉండేవి కావు. ఆయా జిన్నింగుల సామర్థ్యం మేర పత్తిని కేటాయించేవారు. అయితే ఈ ఏడాది సీసీఐ ఎల్-1, ఎల్-2, ఎల్-3 అనే మూడు విభాగాలుగా జిన్నింగులను విభజించింది. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా జిన్నింగులను విభజించి పత్తిని కేటాయిస్తున్నారు.

ఈ విధానాన్ని జిన్నింగ్ వ్యాపారులు వ్యతిరేకిస్తూ.. మార్కెట్ ప్రారంభంలోనే బంద్ కు సిద్దమవగా.. ప్రభుత్వం జిన్నింగ్ మిల్లుల యాజ మాన్యాలతో పలు మార్లు చర్చలు జరిపి.. సడలింపుకు హామి ఇచ్చింది. దీనికి సంబంధించి ఇంత వరకు ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో సోమవారం నుంచి బంద్ కు నిర్ణయించాయి. ఒక వైపు తేమ శాతం ఎక్కువగా ఉందని ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తినే సీసీఐ కొనుగోలు చేస్తుండటం, మరో వైపు జన్నింగ్ మిల్లులు బంద్‌కు పిలుపు ఇవ్వడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు.

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో పత్తి రైతులు సీసీఐ స్థానిక కార్యాలయాల ముం దు ఆందోళనలు నిర్వహించారు. రాష్ట్రంలో 325 జిన్నింగ్ మిల్లులు ఉండగా 242 మిల్లులు మాత్రమే రైతులకు కేటాయించారు. ఇంకా 82 మిల్లులు తెరవకపోవ డంతో ఈ ప్రాంతాల్లోని పత్తి రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి పత్తిని అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో పత్తి రైతులపై రవాణా చార్జీలు భారం పడుతుంది. ఇలాంటి సమయంలో జిన్నింగ్ మిల్లులు బంద్ చేపట్టడం వల్ల రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. 

ఆదిలాబాద్ జిల్లాలో

ఆదిలాబాద్‌లోని సీసీఐ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. తేమ శాతం నిబంధన లేకుండా పత్తి సోయా కొనుగోలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు సీసీఐ సంస్థ నిబంధనల కారణంగా ప్రైవేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు పత్తి కొనుగోలు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిలిచిపో యాయి. జిల్లా వ్యాప్తంగా 34 జిన్నింగులు బంద్‌లో స్వచ్ఛందంగా పాల్గొన్నాయి.

రైతులకు ఈ విషయాన్ని ముందుగానే తెలియ జేయడంతో వారు కూడా మార్కెట్ కు పత్తి తీసుకురాలేదు. పత్తి కొనుగోళ్లలో సీసీఐ కొత్త నిబంధనలతో రైతులతో పాటు ట్రేడర్స్ కూడా నష్టపోతారని జిన్నింగ్ మిల్లుల యాజమన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ చింతవార్ అన్నారు. అన్ని మిల్లులకు కిసాన్ యాప్ లో కేటాగిరిలు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. 

పత్తిపై నిబంధనలు ఎత్తివేయాలి: మంత్రి తుమ్మల 

కేంద్ర జౌళి శాఖ అధికారులతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. జిన్నింగ్ మిల్లులు బంద్ చేపట్టడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పత్తికి సంబంధించిన 12 శాతం తేమ, ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తినే కొనుగోలు పరిమితిపై మరోసారి సమీక్ష చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. 

రైతులు రేయింబవళ్లు కష్టపడి సాగు చేసిన పంటలు , వాతావరణ మార్పులు, అకాల వర్షాలు, తుపాన్‌లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఇలాంటి సమయంలో సీసీఐ పెట్టిన నిబంధనలతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

ఇక పెసళ్లు, కందులు, పొద్దుతిరుగుడు వంటి పంటలపై 25 శాతం వరకే కొనుగోలు పరిమితి విధించడంతో.. మిగతా పంటను ప్రయివేట్‌కు అమ్ముకోవాల్సి వస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు. సోయాబిన్ రంగు మారిందని కొనుగోలు చేయడం లేదన్నారు. జిన్నింగ్ మిల్లులు చేపట్టిన బంద్‌ను విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.