దర్శన్‌కు చెక్ పెట్టిన గిరీశ్
- కన్నడ సినీ స్టార్‌ను వెంటాడిన సూపర్‌కాప్
- హత్యకేసులో అద్భుత దర్యాప్తుతో నిజం వెలికి..
బెంగళూరు, జూన్ 14: చిన్నచిన్న నేరగాళ్లను పట్టుకోవటమే కష్టమైన ప్రస్తుత కాలంలో సెలబ్రిటీల స్థాయివాళ్లు నేరాలు చేస్తూ వారిని టచ్ చేయటం కూడా పోలీసులకు ఒక్కోసారి సాధ్యం కాదు. ఇక సినీ పరిశ్రమంల్లో లక్షలమంది అభిమానులున్న స్టార్లు నేరం చేస్తే, ఆ నేరాల దర్యాప్తు పోలీసులకు కత్తిమీద సామే అవుతుంది. అలాంటిది కన్నడ సినీ పరిశ్రమలో అతిపెద్ద స్టార్లలో ఒకడిగా వెలుగొందుతున్న హీరో దర్శన్‌కు ఓ సూపర్ కాప్ తెలివిగా చెక్ పెట్టాడు.
తన ప్రియురాలు, కన్నడ నటి పవిత్ర గౌడను వేధించాడన్న కారణంతో ఓ వ్యక్తిని దర్శన్ కిరాయి మనుషులతో చంపించాడన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో దర్శన్‌తోపాటు 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సాహసోపేత దర్యాప్తు వెనుక ఓ సూపర్ పోలీస్ అధికారి బుర్ర ఉన్నదని తాజాగా తేలింది. ఆ సూపర్ కాప్ పేరు ఎస్ గిరీష్.. బెంగళూరులోని పశ్చిమ డివిజన్ డీసీపీ. అతను లేకుంటే ఈ కేసులో నిజం శాశ్వతంగా భూస్థాపితం అయ్యేదని అని విజయనగర్ అసిస్టెంట్ కమిషనర్ చందన్‌కుమార్ అన్నారు. నిజానికి కర్ణాటక పోలీస్ విభాగంలో రిగీశ్‌తోపాటు చందన్‌కుమార్‌ను సూపర్ కాప్స్‌గా, రియల్ హీరో లుగా సంబోధిస్తారు.
అంతపట్టాన నమ్మితేనా...!
ఈ హత్యకేసులో రేణుకాస్వామి మృతదేహం మురికి కాల్వ నుంచి బయటపడగానే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. కేసు పెద్దది కాకముందే మూసేయాలని దర్శన్ నలుగురిని ఠాణా వెళ్లి లొంగిపో యేలా చేశారు. కానీ, గిరీజ్ ఎంతకూ నమ్మలేదు. దీంతో చందన్‌తో కలిసి రంగంలోకి దిగారు. తమదైన శైలిలో ఆ నలుగురిని విచారించటంతో నిజం కక్కేశారు. ఒక అమాయ కున్ని చంపి, డబ్బులిచ్చి ఆ కేసును పక్కదారి పట్టించాల్సిన అవసరం ఎవరికి ఉందని గిరీశ్ అనుమానించారు. ఈ సమయంలో ఓ రెస్టారెంట్ ఓనర్ వినయ్ పేరు బయటకు వచ్చింది. అతడు దర్శన్‌కు అత్యంత సన్నిహితుడు.
అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తే నేరస్తులంతా బయటపడ్డారు. రేణుకాస్వామిని ఎందుకు, ఎలా, ఎక్కడ హత్య చేసింది మొత్తం చెప్పేశాడు. దీంతో మైసూరులో ఉన్న దర్శన్‌ను అరెస్టు చేసేందుకు గిరీశ్ పక్కాగా స్కెచ్ వేశారు. దర్శన్ బసచేసిన హోటల్లో చందన్‌కుమార్ బృందాన్ని దింపాడు. ఉదయం ఆయన వద్దకు వెళ్లిన చందన్ టీమ్.. తాము ఎందుకు వచ్చామో చెప్పారు. దీంతో సినీ హీరోకు చిత్రం మొత్తం అర్థమైంది. తన కారులో వస్తానని చెప్పి లొంగిపోయారు. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. రేణుకాస్వామి మృతదేహాన్ని మాయం చేసేం దుకు ప్రయత్నించిన దర్శన్ కారు డ్రైవర్ రవిని పోలీసులు అరెస్టు చేశారు.






