02-02-2026 12:00:00 AM
వైద్యుల నిర్లక్ష్యం వల్లే జరిగింది.. వారిని శిక్షించాలి
ప్రభుత్వాస్పత్రి ఎదుట తల్లిదండ్రులు, బంధువుల ధర్నా
ఐదు గంటల పాటు కొనసాగిన ఉద్రిక్తత
న్యాయం చేస్తామని పోలీసు అధికారుల హామీ
కామారెడ్డి, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): వైద్యుల నిర్లక్ష్యం వల్లే మా పాప మృతి చెందిందని తల్లిదండ్రులు, బంధువులు కామారెడ్డి ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రివద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణం అయ్యప్ప నగర్‌లో ఉంటున్న అర్చన రమేశ్ ల రెండు సంవత్సరాల కుమార్తె క్రితారాశ్రీ గతంలో కుక్క కాటుకు గురైంది.రెండుసార్లు ఇంజక్షన్ డోస్ వేయించారు. మూడో డోస్ కోసం ఆదివారం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చి వ్యాక్సిన్ వేయించారు. అయితే వేసిన కొద్దిసేపటికే పాప కోమాలోకి వెళ్లినట్లు తల్లిదండ్రులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంవల్లే వల్లనే తమ పాప మృతి చెందిందని అర్చన,రమేశ్‌లు బోరుమని విలపిస్తూ చెప్పారు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి వచ్చి వైద్యులను నిలదీశారు.
అలాగే ఆస్పత్రిపై రాళ్లు రువ్వడంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి భారీ బందోబస్తు నిర్వహించారు.దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఆందోళనలో బాలిక మృతికి కారకులైన వైద్యులను కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేశారు. కామారెడ్డి ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసరావు, పట్టణ ఎస్‌హెచ్‌ఓ నరహరి, రూరల్ సీఐ రామన్, భిక్కనూర్ సీఐ సంపత్ కుమార్, ఎస్‌ఐలు పోలీస్ బలగాలతో చేరుకొని చర్యలు చేపట్టారు. బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడి తగిన న్యాయం చేస్తామన్నారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా బాధ్యులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు బాలిక తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.