02-02-2026 12:00:00 AM
కుటుంబాన్ని పరామర్శించి, పాడే మోసిన ఎమ్మెల్యే మదన్ మోహన్
సదాశివనగర్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మర్కల్ గ్రామ మాజీ సర్పంచ్ జూకంటి సంగారెడ్డి (50) గుండెపోటుతో శని వారం రాత్రి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఎక్కడ చూసినా ఆయన సర్పంచిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి ఆపద సమయంలో ఆదుకున్న కుటుంబాలు కన్నీరు మున్నీరయ్యాయి. గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న గ్రామస్తులు మండల ప్రజలు కన్నీరు మున్నీరుగా కంటతడి పెట్టారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్న సంగారెడ్డి ప్రతి ఒక్క కార్యకర్తతో చనువుగా గౌరవప్రదంగా ఉండేవారని ప్రతి ఒక్కరిని పలకరిస్తూ జీవించేవాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జ్ఞాపకలను గుర్తు చేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యారు.
మండలంలోని అన్ని గ్రామాల పార్టీ కార్యకర్తలు ప్రజలు ఆయన అంతిమ సంస్కార కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆదివారం సదాశివ నగర్ మండలం మర్కల్ గ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. మండలంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని పలకరించిన కంటతడి పెట్టని వారు లేరు. ఆయన మరణవార్త తెలుసుకున్న వెంటనే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మర్కల్ గ్రామానికి చేరుకుని, సంగారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ కన్నీళ్లు పెట్టుకుని ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పాడె మోసి, చితికి నిప్పు పెట్టే వరకూ అక్కడే ఉండి, చివరి కార్యక్రమాల్లో పాల్గొని తన మానవీయతను చాటుకున్నారు.జూకంటి సంగారెడ్డి ప్రజాసేవకు అంకితభావంతో పనిచేసిన నాయకుడని, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు మరువలేనివని ఎమ్మెల్యే మదన్ మోహన్ పేర్కొన్నారు. ఆయన ఆకస్మిక మృతి పార్టీకి, గ్రామ ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని జూకంటి సంగారెడ్డి కి చివరి వీడ్కోలు పలికారు.