ఇంటర్‌లో బాలికలదే విజయ దుందుభి
రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ఇయర్‌లో 19, సెకండియర్‌లో 21 స్థానం
రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు
మంచిర్యాల, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆది వారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరం ఫలితాల్లో బాలికలదే హవా కొనసాగింది. రాష్ట్ర స్థాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మంచిర్యాల జిల్లా గత ఏడాది 26వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 21వ స్థానానికి చేరింది. అలాగే సెకండియర్ ఫలితాల్లో గత ఏడాది 21వ స్థానం లో ఉండగా ఈ ఏడాది 19వ స్థానంలో నిలిచింది. గత ఏడాదతో పోల్చితే ఈ ఏడాది ఫలితాలు కొంచెం మెరుగయ్యాయి.
ఇంటర్ సెకండియర్‌లో...
2025- విద్యా సంవత్సరంలో ఇంట ర్ సెకండియర్ లో 4,741 (2,137 బాలురు, 2,604 బాలికలు) పరీక్షలు రాయగా 3,396 (1,341 బాలురు, 2,055 బాలికలు) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 71.63 శాతంతో 19వ స్థానంలో నిలిచింది. వొకేషనల్ విభాగంలో 784 (360 బాలురు, 424 బాలికలు) మంది పరీక్షలు రాయగా 601 (234 బాలురు, 367 బాలికలు) ఉత్తీర్ణులయ్యారు. 76.66 శాతంతో రాష్ట్ర స్థాయిలో పదవ స్థానంలో జిల్లా నిలిచింది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో..
2025 విద్యా సంవత్సరంలో ఇంట ర్ ఫస్ట్ ఇయర్‌లో 5,372 (2,424 బాలురు, 2,948 బాలికలు) పరీక్షలు రాయగా 3,240 (1,181 బాలురు, 2,059 బాలికలు) ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 60.31 శాతం తో 21వ స్థానంలో జిల్లా నిలిచింది. వొకేషనల్ విభాగంలో 888 (466 బాలురు, 422 బాలికలు) మంది పరీక్షలు రాయగా 511 (222 బాలురు, 289 బాలికలు) ఉత్తీర్ణులయ్యారు. 57.55 శాతంతో రాష్ట్ర స్థాయిలో 23వ స్థానంలో మంచిర్యాల నిలిచింది.
ఇంటర్‌లో సత్తాచాటిన బాలికలు..
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జిల్లా విద్యార్థినీలు సత్తా చాటారు. ఇంటర్ సెకండియర్ (జనరల్) లో బాలురు 62.75 శాతం ఉత్తీర్ణులు కాగా బాలికలు 78.92 శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో నిలిచారు. ఫస్ట్ ఇయర్ (జనరల్) లో బాలురు 48.72 శాతం ఉత్తీర్ణులు కాగా బాలికలు 69.84 శాతం ఉత్తీర్ణత సాధించి బాలురను వెనక్కి నెట్టారు.
వొకేషనల్ సెకండియర్ లో బాలురు 65 శాతం ఉత్తీర్ణులు కాగా బాలికలు 86.56 శాతం ఉత్తీర్ణతతో దూసుకుపోగా ఫస్ట్ ఇయర్ లో బాలురు 47.64 శాతం ఉత్తీర్ణులు కాగా బాలికలు 68.48 శాతం ఉత్తీర్ణత సాధించి ముందంజలో ఉన్నారు. గత ఏడాది సైతం బాలికలే మొదటి వరుసలో నిలిచారు.
రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించిన మోడల్ స్కూల్ విద్యార్థులు..
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలల కేటగిరీలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో దానపెల్లి రిశ్విక 470 మార్కులకు 468 మార్కులతో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం లో నిలిచి జిల్లా పేరును రాష్ట్ర స్థాయిలో నిలిపింది. అలాగే బైపీసీ విభాగంలో చప్పిడి వైష్ణవి 440 మార్కులకు 434 మార్కులతో, సెకండియర్ ఎంపీసీ విభాగంలో మెండు అమూల్య 992 మార్కులతో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారు.
ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శాలువాలు, బొకేలతో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ముత్యం బుచ్చన్న, అధ్యాపక బృందం, తల్లిదండ్రులు అభినందిం చారు. అలాగే శ్రీరాం పూర్ ఏరియా ఆర్ కే - 5 గనిలో జనరల్ మజ్దూర్ గా విధులు నిర్వహిస్తున్న రెంకా చంద్రమౌళి కూతురు రెంకా వైష్ణవి సైతం ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విభాగంలో 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ స్థానంలో, ఉమ్మడి ఆదిలాబాద్ టాపర్‌గా నిలిచింది.





