calender_icon.png 3 December, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్ పనుల్లో నాణ్యత ఉండాలి

03-12-2025 12:42:56 AM

-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్  

-వార్‌రూమ్ సందర్శన    

సూచనలు ఇచ్చిన భట్టి  

హైదరాబాద్, డిసెంబర్ 2 (విజయక్రాంతి) : ప్రజా భవన్ లో ఏర్పాటుచేసిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ వార్ రూమ్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం సందర్శించారు. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన తోపాటు ఈనెల 8, 9న భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్న గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి ఏర్పాటు చేసిన కమిటీలు, వాటి పనితీరు, ప్రగతి తదితర అంశాలను డిప్యూ టీ సీఎం కూలంకుషంగా చర్చించారు.

గ్లోబల్ సమ్మిట్ విజయవంతానికి ఏర్పాటుచేసిన ఇన్విటేషన్, హాస్పిటాలిటీ, వేదిక, లాజిస్టిక్స్, ట్రాన్స్ పోర్ట్, ప్రోగ్రాం, కల్చరల్ ఈవెంట్స్, కమ్యూనికేషన్, డిజిటల్ మీడి యా కమ్యూనికేషన్ కమిటీల అధ్యక్షులు, టీం సభ్యులతో డిప్యూటీ సమీక్షించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ప్రతి విభాగంలో పనిచేస్తున్న బృంద సభ్యుల తో డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడి పనులు జరుగుతున్న తీరును, వసతి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా పనుల్లో వేగం పెంచడంతోపాటు నాణ్యత, స్పష్టత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత కొద్దిరోజులుగా వార్ రూమ్‌లో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పై సమావేశాలు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్ రూమ్ ను సందర్శించారు.

రేపటి నుంచి మంత్రులు సైతం వార్ రూమ్ ను సందర్శించి జరుగుతున్న పనులను పర్యవేక్షించనున్నారు. డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశంలో సీనియర్ అధికారులు సవ్యసాచి ఘోష్, సంజయ్ కుమార్, సందీప్ కుమార్ సుల్తానియా, అజిత్ రెడ్డి, ప్రభుత్వ మీడియా సలహాదారు శ్రీరామ్ కర్రీ తదితరులు పాల్గొన్నారు.