22 April, 2026 | 1:39 AM

రమణ దారెటు?

22-04-2026 12:30 AM
  1. జగిత్యాలలో ప్రత్యర్థులు ఒక్కటవుతారా?
  2. జీవన్‌రెడ్డికి పదవి.. అసంతృప్తికి కారణమా?
  3. బీసీ వర్గాల్లో శక్తివంతమైన నాయకుడుగా రమణకు గుర్తింపు

కరీంనగర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల మాజీ ఎమ్మెల్యే ఎల్ రమణ భవిష్యత్ రాజకీయ దిశపై చర్చలు ఊపందుకున్నాయి. జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి చేరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, రమణ రాజకీయ అడుగులు ఎలా ఉంటాయన్నది హాట్ టాపిక్‌గా మారింది.

జగిత్యాల రాజకీయాల్లో ఒకప్పుడు ప్రత్యర్థులుగా నిలిచిన రమణ, జీవన్ రెడ్డి ఇప్పుడు ఒకే వేదికపై పనిచేయాల్సిన పరిస్థితి రావడం సులభం కా దని పలువురు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎదిగి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అనంతరం కరీంనగర్ ఎంపీగా పనిచేసిన రమణకు స్థానికంగా బలమైన పట్టుంది. అలాంటి నాయకుడు పాత రాజకీయ ప్రత్యర్థితో కలిసిపని చేయడం అంత సులభం కాదని అనుచరులు చెబుతున్నారు.

ఇక జీవన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరగానే కీలక బాధ్యతలు అప్పగించడం కూడా రమణ అసంతృప్తికి కారణమైందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల మధ్య రమణ బీఆర్‌ఎస్‌లో కొనసాగుతారా? లేక కొత్త దిశగా అడుగులు వేస్తారా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. దీంతో రాజకీయ వర్గాల్లో రమణ ఏ పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎమ్మెల్సీగా ఆయన ఆయన పదవీకాలం 2027 డిసెంబర్ వరకు కొనసాగనుంది.

అయితే భవిష్యత్ రాజకీయ ప్రణాళికలపై ముందే నిర్ణయం తీసు కుంటారా? అనే మీమాంస కూడా వ్యక్తం అవుతుంది. కాగా ఎల్.రమణకు ఎమ్మెల్సీ అవకాశాలను రాబోయే కాలంలో కల్పించి పార్టీలోనే కొనసాగేలా ప్రయత్నాలు కూడా బీఆర్‌ఎస్‌లో మొదలైనట్లు వినికిడి. మూడు దశాబ్దాలపాటు నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా రమణ గుర్తింపు పొందారు. 2021లో టీడీపీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.

బీసీల్లో శక్తివంతమైన నాయకుడిగా రమణకు ప్రత్యేక గుర్తింపు ఉంది. టీడీపీ నుంచి ఆయన వైదొలగడంతో బీసీ వర్గానికి గట్టి దెబ్బ తగిలింది. ఇప్పు డూ అదే పరిస్థితి బీఆర్‌ఎస్‌కు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా రమణ తీసుకోబోయే నిర్ణ యం తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు అయ్యే అవకాశం ఉంది.

జీవన్ రెడ్డి రాజకీయ సమీకరణాలపై ఓ కన్నేసి, తన రాజకీయ మనుగడను ఎలా మలచుకోవాలో అన్న ఆలోచనలో ఎల్.రమణ ఉన్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ విషయంలో రానున్న రోజుల్లో కరీంనగర్ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారే అవకాశం లేకపోలేదు.