నిరసనలోనూ దొరతనమేనా?
* బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేసి.. కేటీఆర్, హరీశ్‌రావు ఎందుకు వేసుకోలేదు
* బీఆర్‌ఎస్ తీరుపై మంత్రి సీతక్క ఫైర్
హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరీష్‌రావుల దొరతనం మరోసారి బయటపడిందని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేపట్టిన నిరసనల్లోనూ సమానత్వం లేదని, దురంకారాన్ని ప్రదర్శించారని మంత్రి సీతక్క దుయ్యబట్టారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో మంత్రి సీతక్క మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు బేడీలు వేశారని, కానీ మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావులు బేడీలు ఎందుకు వేసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు పదిసార్లు బేడీలు వేసింది మర్చిపోయారా..? అని మంత్రి సీతక్క నిలదీశారు.
ఇప్పుడు రైతులకు బేడీలు వేయడంపై బీఆర్‌ఎవ నేతలకు మాట్లాడే అర్హత లేదన్నారు. రైతులకు బేడీలు వేసిన అధికారులపై కనీసం చర్యలు తీసుకోలేదని, కానీ లఘచర్ల ఘటనకు సంబంధించిన అంశంపై రైతుకు బేడీలు వేసిన అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తక్షణమే స్పందించారని, అధికారులపై చర్యలు కూడా తీసుకున్నారని చెప్పారు. గతంలో సభలో సభ్యులు వెల్‌లోకి వస్తే సభ నుంచి సస్పెండ్ చేసే వారని, కానీ ఇప్పుడు వాళ్లు పెట్టిన నిబంధనలనే వాళ్లే కాలరాస్తున్నారని విమర్శించారు.
నల్ల దుస్తులు, బేడీలతో బీఆర్‌ఎస్ నిరసన
లగచర్ల రైతులకు మద్దుతుగా అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, చేతులకు బేడీలతో అసెంబ్లీకి వచ్చారు. ‘ఇదేమి రాజ్యం.. ఇదేమి రాజ్యం. లాఠీ రాజ్యం.. లూటీ రాజ్యం. రైతులకు బేడీలా? సిగ్గు సిగ్గు’ అంటూ బీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయం నుంచి అసెంబ్లీ లాబీ వరకు నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. లగచర్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శాసన మండలి సభ్యులు కూడా మండలిలో నల్లరంగు దుస్తులు ధరించి నిరసన చేపట్టారు.
అంతకు ముందు పరిశ్రమల పేరుతో ప్రభుత్వం బలవంతపు భూసేకరణ, రైతుల అరెస్టుపై బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే నల్ల దుస్తులను ఎమ్మెల్యేందరు ధరించగా, బేడీలు మాత్రం సుధీర్‌రెడ్డి, గంగుల కమలాకర్, సంజయ్‌కుమార్, అనిల్ జాదవ్‌లే వేసుకున్నారు.






