12 June, 2026 | 9:02 PM

డీసీఎం వ్యాన్ ఢీకొని మేకల కాపరి మృతి

12-06-2026 07:59 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): డీసీఎం వ్యాన్ ఢీకొని మేకల కాపరి మృతి చెందాడు. ఎల్లారెడ్డి రహదారిపై కొట్టాల్ గ్రామం వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. 20 మేకలు సైతం.. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొట్టాల్‌కు చెందిన ఆలకుంట శివయ్య, బోదాస్ గంగారం, కిషన్ తమ మేకలను కొట్టం నుంచి వదిలి మేత కోసం అడవికి తీసుకెళ్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు నుంచి ఎల్లారెడ్డి  వైపు అతివేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ మేకలను, కాపరి శివయ్యను ఢీకొట్టింది.

అపస్మారక స్థితిలో ఉన్న శివయ్యను ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. ఈ ప్రమాదంలో ఆలకుంట శివయ్యకు చెందిన 13 మేకలు, బోదాస్ గంగారాంకు చెందిన 2 మేకలు, కిషన్‌కు చెందిన 5 మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎల్లారెడ్డి ఎస్ఐ తెలిపారు.