29 August, 2026 | 2:14 AM

సింగభూపాలెం చెరువుకు త్వరలో గోదావరి జలాలు

29-08-2026 12:00 AM

చెరువుకట్ట పటిష్టతకు రూ.5 కోట్లు మంజూరు

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

సుజాతనగర్, ఆగస్టు 28 (విజయక్రాంతి): సింగభూపాలెం చెరువుకు అతిత్వరలోనే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను రానున్నాయని, అందుకు సంబందించిన ప్రతిపాదనలు సిద్దమయ్యాయని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు.

సుజాతనగర్ మండల పరిధిలోని సింగభూపాలెం చెరువును శుక్రవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు జలాలు స్థానిక రైతాంగానికి అందకుండా గతంలో అన్యాయం జరిగిందన్నారు. కొత్తగూడెంతో పాటు భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల సాగు అవసరాలకు ఈ నీటిని మళ్లించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వంతో పలుమార్లు చర్చలు జరిపి గట్టిగా ఒత్తిడి తీసుకువచ్చామని తెలిపారు.

దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. జూలూరుపాడు మండలం వినోభానగర్ మీదుగా మండలంలోని చెరువులన్నింటినీ నింపుతూ, అక్కడి నుంచి పెద్దవాగు ద్వారా సుజాతనగర్ మండలంలోని సింగభూపాలెం చెరువుకు గోదావరి జలాలు చేరేలా ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. కూనంనేని వెంట సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్, కమిషనర్, సుజాత, ఎంపిడివో భారతి, తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.