మీ ఇల్లు బంగారంగానూ..
ఎంత పుత్తడి ఇంట్లో పెట్టుకోవచ్చో తెలుసా!
ప్రభుత్వ నిబంధనలు ఏం చెపుతున్నాయి?
బంగారంపై పన్ను ఎంత?
సాధారణంగా బంగారాన్ని ఆభరణాలు, గోల్డ్ బార్స్, కాయిన్స్ రూపంలో కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలామందికి అవి విక్రయించినపుడు లేదా వేరే డిజైన్ కోసం జ్యువెలరీని మార్పిడి చేసుకున్నపుడు ఎంత పన్ను పడుతుందో అవగాహన ఉండదు. ప్రస్తుత ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం పన్ను విధింపు అనేది మీరు ఎంతకాలంగా ఆ జ్యువెలరీ లేదా బార్స్, కాయిన్స్ మీ వద్ద ఉన్నాయనేదానిపై ఆధారపడి ఉంటుంది. బంగారం విక్రయిస్తే దానిపై వచ్చే మూలధన లాభాలపై పన్ను ఉంటుంది.
ఆ బంగారం మీ వద్దనున్న కాలానికి అనుగుణంగా దానిపై స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్సా లేక దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్సా అనేది నిర్ణయిస్తారు. బంగారాన్ని లేదా ఆభరణాన్ని మీరు కొనడం, అమ్మడం మూడేండ్లలోపు జరిగితే (36 నెలలు) దానిని షార్ట్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. ఈ స్వల్పకాలిక లాభాన్ని మీ మొత్తం ఆదాయంలో కలిపి, మీకు వర్తించే ఇన్‌కమ్ ట్యాక్స్ బ్రాకెట్ ప్రకారం పన్ను చెల్లించాలి. అదే కొనుగోలు, అమ్మకం మధ్యకాలం 36 నెలలు మించితే లాంగ్‌టెర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌గా పరిగణిస్తారు. బంగారం లాంగ్‌టెర్మ్ గెయిన్స్‌పై 20 శాతం పన్ను, ఆపై సర్‌ఛార్జ్, 4 శాతం సెస్ ఉంటుంది. అయితే దీనికి ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉంటుంది. అంటే మీరు కొని, అమ్మే కాలం మధ్యలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, మీ లాభాన్ని లెక్కించుకోవచ్చు.
వివాహితలు, అవివాహితలు ఎంత బంగారం అట్టిపెట్టుకోవచ్చంటే..
ఆదాయపు పన్ను అధికారులకు ఎటువంటి ప్రూఫ్ చూపించనక్కర్లేకుండా ఇంట్లో ఎంత బంగారాన్ని దాచుకోవచ్చన్న అంశంపై కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ పరిమితుల్ని నిర్దేశించింది. ఆ నిబంధనల ప్రకారం పెండ్లి అయిన మహిళలు ఎటువంటి రుజువులూ చూపించక్కర్లేకుండా 500 గ్రాముల వరకూ బంగారు ఆభరణాల్ని ఇంట్లో ఉంచుకోవచ్చు. పెండ్లి కాని అమ్మాయిలైతే 250 గ్రాముల పరిమాణం గల ఆభరణాల్ని దాచుకోవచ్చు. అదే పురుషులకు ఈ పరిమితి 100 గ్రాములు మాత్రమే. అంతకంటే ఎక్కువ ఉంటే ఆదాయపు ఆధారాలు చూపించాల్సిందే. ఆదాయపు పన్ను అధికారులు దాడులు జరిపిన సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన పరిమితిలోపు బంగారు ఆభరణాలు లభిస్తే వాటిని స్వాధీనపర్చుకోరు.






