23 August, 2026 | 10:12 PM

గోల్డెన్ అవర్.. నేరగాళ్లకు ఫీవర్

13-06-2024 01:57 AM

సైబర్ నేరగాళ్ల బారినపడితే గంటలో ఫిర్యాదు చేస్తే ప్రయోజనం

సొమ్ము రికవరీకి అవకాశం

1930 టోల్ ఫ్రీ నంబర్‌పై అవగాహన కల్పిస్తున్న పోలీసులు

మెదక్, జూన్ 12 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వివిధ పద్ధతుల్లో ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు. ఇలా మోసపోయిన వారిలో ఉద్యోగులు, యువతే ఎక్కువ మం ది ఉండడం గమనార్హం. సాంకేతికత ఎంత వేగంగా పెరుగుతుందో అంతే స్పీడు తో మోసాలు జరుగుతున్నాయి.

అయితే టెక్నాలజీని అర్థం చేసుకున్న వారు సైతం ఒక్కో సారి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడిపోతున్నారు. ఇలాంటి వారి చేతిలో మోస పోయే బాధితులకు వరంలా మారుతుంది గోల్డెన్ అవర్. మోసపోయిన గంటలోపు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న సొమ్మును రాబట్టుకోవచ్చు. సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు గోల్డెన్ అవర్‌పై అవగాహన కల్పిస్తున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1930 బాధి తుల పాలిట వరంలా మారుతోంది. 

ఫోన్ చేస్తే చాలు..

బాధితులు మోసపోయినట్లు గ్రహిస్తే వెంటనే గంటలోపు ’1930’ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలి. నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌సీ)లో ఫిర్యాదు నమోదు చేయాలి. అరగంట, గంట సమయంలో ఫిర్యాదు చేసే బాధితులకు న్యా యం జరుగుతుంది. బాధితుల ఖాతాలో నుంచి నగదు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా ఫ్రీజ్ చేస్తారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘సైబర్ వారియర్స్’ అందుబాటులో ఉన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన అరగంట, గంటలోపు ఫిర్యాదు చేసే 90 నుంచి వంద శాతం రికవరీ చేసే అవకాశం ఉంటుంది. ఆరు గంటల వరకైతే 60 శాతం, ఆ తర్వాత కేవలం 30 శాతం వరకే రికవరీ చేసే అవకాశం ఉంటుంది. 

లింకులు ఓపెన్ చేయొద్దు..

స్మార్ట్‌ఫోన్‌లో వచ్చే అనవసర లింకులు, యాప్‌లు ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైం పోలీసులు చెబుతున్నారు. అలాగే సోషల్ మీడియా యాప్‌లు, ఇన్‌స్టాల్ చేసిన తర్వాత వ్యక్తిగత వివరాలతో పాటు బ్యాంక్ వివరాలను పొందుపర్చవద్దని సూచి స్తున్నారు. లక్కీ లాటరీలో మొబైల్ నంబర్ వచ్చిందని లింకులు వస్తే ఓపెన్  చేయవద్దని పేర్కొంటున్నారు. దీంతో పాటు మ్యాట్రిమోనీ పేరి ట, కాల్‌గర్ల్స్ కాల్స్, ఆన్‌లైన్ గేమ్స్, కేవైసీ పేరిట ఫోన్లు చేస్తూ మోసాలకు పాల్పడతారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అను మానాస్పద లింకులు ఓపెన్ చేసినా, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసినా ఖాతాల్లోంచి నగదు మాయమవుతుందని పోలీసులు చెబుతున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దని చెబుతున్నారు. 

టోల్ ఫ్రీ నంబర్‌ను వినియోగించుకోవాలి..

ఎవరైనా సైబర్ నేరగాళ్ల బారినపడి సొమ్ము పొగొట్టుకుంటే వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే సొమ్ము రికవరీ అయ్యేందుకు అవకాశం  ఉంది. ఎక్కువగా చదువుకున్న వాళ్లే మోసపోతున్నారు. మోసానికి గురి కాగానే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయడం వల్ల వారి సొమ్ము ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లాలో కొంతమంది టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వడం వల్ల మేలు జరిగింది. 

డాక్టర్ బాలస్వామి, 

మెదక్ ఎస్పీ