calender_icon.png 16 July, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువికి చేరిన శుభాంశు

16-07-2025 01:06:28 AM

యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతం

  1. ఐఎస్‌ఎస్‌లో 18 రోజుల్లో 60 రకాల ప్రయోగాలు
  2. కాలిఫోర్నియా సమీపంలోని సముద్రంలో ‘డ్రాగన్’ సురక్షిత ల్యాండింగ్
  3. మీ యాత్ర కోట్లాది మందికి స్ఫూర్తి: ప్రధాని మోదీ
  4. ఆగస్టు 17న భారత్‌కు రానున్న శుభాంశు

న్యూఢిల్లీ, జూలై 15: యాక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర విజయవంతంగా ముగిసింది. దాదాపు 18 రోజు ల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో గడిపిన శుభాంశు బృందం క్షేమంగా భూమి మీదకు అడుగుపెట్టింది. వీరు ప్రయాణం చేసిన ‘డ్రాగ న్’ స్పేస్ క్రాఫ్ట్ ఐఎస్‌ఎస్ నుంచి విడిపోయి దాదాపు 22 గంటల ప్రయాణం తర్వాత భారత కాలమాన ప్రకారం మం గళవారం మధ్యాహ్నం 3.01 గంటల సమయంలో అమెరికా కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో సురక్షితంగా ల్యాండ్ అయింది.

అక్కడే ఉన్న అమెరికా నేవీ సిబ్బంది వారి వద్దకు చేరుకొని క్యాప్సూల్‌ను నౌకలోకి తీసుకొచ్చారు. కొన్ని నిమిషాల వ్యవధిలో గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా సహా కమాండర్ పెగ్గీ విట్సన్ (అమెరికా), స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ (పోలండ్), టిబోర్ కపు (హంగేరి) ఒక్కొ క్కరుగా ఆలింగనం చేసుకుంటూ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చారు. వ్యోమగాములకు భద్రతా తనిఖీలు జరిపిన అనంతరం నాసా కేంద్రానికి తర లించారు.

అక్కడే ఏడు రోజుల పాటు నలుగురు వ్యో మగాములు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఐఎస్‌ఎస్‌లో జీరో గ్రావిటీలో గడిపి వచ్చిన వ్యోమగాముల శరీరాలు భూ వాతావరణానికి అలవాటు పడేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పే ర్కొంది. ఇస్రోకు చెందిన ఫ్లుటై సర్జన్లు వారం రో జుల పాటు వ్యోమగాముల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిరంతరం పర్యవేక్షిస్తారని వెల్లడించింది.

శుభాంశు శుక్లా బృందం భూమికి సురక్షితంగా చేరుకోవడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. పట్టుదల, అంకితభావం, సాహస చర్యల ద్వారా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారని మోదీ కొనియాడారు. ఆగస్టు 17న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా స్వదేశానికి రానున్నారు. 

మీ యాత్ర గగన్‌యాన్‌కు దిక్సూచి: మోదీ

శుభాంశు అంతరిక్ష ముగింపు యాత్రపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ‘అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా భూమి మీదకు చేరుకున్న గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు దేశం తరఫున ఘన స్వాగ తం పలుకుతున్నా. ఐఎస్‌ఎస్‌ను సందర్శించిన తొ లి భారతీయ వ్యోమగామిగా శుభాంశు చరిత్ర సృ ష్టించారు.

ఆయన చూపిన పట్టుదల, అంకితభావం, సాహస చర్యలతో  కోట్లాది మందికి స్ఫూర్తి గా నిలిచారు. శుభాంశు యాత్ర కోట్లాది మంది కలలకు ప్రేరణగా నిలిచింది. ఈ చారిత్రాత్మక యాత్ర భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు దిక్సూచిగా నిలవనుంది’ అని మోదీ పేర్కొన్నారు.

22 గంటల సుదీర్ఘ ప్రయాణమెందుకు?

భూమికి కేవలం 400 కిలోమీటర్ల ఎత్తులో ఉండే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్) నుంచి డ్రాగన్ వ్యోమనౌక తిరిగి రావడానికి ఒక రోజు పట్టడం కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. కానీ అంతరిక్షం నుంచి భూకక్ష్యలోకి ప్రవేశించే ప్రయాణం కాస్త క్లిష్టతరం. దీనికి సంక్లిష్టమైన మెకానిక్స్, భద్రతా ప్రోటోకాల్స్, ఖచ్చితమైన ల్యాండింగ్ అవసరం ఉంటుంది. అంతరిక్ష కేంద్రం నుంచి నేరుగా దిగకుండా భూకక్ష్యలోకి ప్రవేశించడానికి ముందు ఇంజిన్ బర్న్‌ల శ్రేణిని నిర్వహించాల్సి ఉంటుంది.

ఇది కక్ష్యను నేరుగా ఢీకొట్టకుండా నివారిస్తుంది. అనంతరం స్పేస్‌క్రాఫ్ట్ భూమి మీదకు రావడానికి ముందు కొన్ని గంటల పాటు స్వతంత్రంగా భూకక్ష్యలోనే చక్కర్లు కొడుతుంది. వ్యోమనౌక ఐఎస్‌ఎస్ నుంచి భూమికి చేరే క్రమంలో గంటకు 28వేల కిలోమీటర్ల వేగంతో కక్ష్యలో తిరుగుతుంది. సురక్షితమైన, ఖచ్చితమైన ల్యాండింగ్‌ను నిర్థారించడానికి వ్యోమనౌక సరైన కక్ష్య సానం కోసం వేచి చూడాలి.

భూకక్ష్యలోకి పునఃప్రవేశించే సమయంలో డ్రాగన్ క్యాప్సూల్ తీవ్రమైన వేడిని ఎదుర్కొంటుంది. ఆ తర్వాత భూ వాతావరణంలోకి ప్రవేశించిన స్పేస్ క్రాఫ్ట్‌కు పారాచూట్లను రెండు దశల్లో అమర్చుతారు. మొదట 5.7 కిమీ ఎత్తులో.. తర్వాత 2 కిమీ వద్ద ప్రధాన పారచూట్లను ఏర్పాటు చేసి సముద్రం మీద నెమ్మదిగా స్లాష్‌డౌన్ అయ్యేలా చర్యలు తీసుకుంటారు. 

మావాడు సురక్షితంగా తిరిగొచ్చాడు 

మరోవైపు యాక్సియం-4 మిషన్ విజయవంతం కావడంపై భారతీయుల్లో ఆనం దం వ్యక్తమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా తో పాటు మిగిలిన వ్యోమగాముల బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. శుభాంశు స్వస్థలం లక్నోలో కేక్ కట్ చేసి సం బరాలు చేసుకున్నారు. కాగా శుభాంశు ప్రయాణించిన డ్రాగన్ క్యాప్సూల్  కాలిఫోర్నియా సముద్ర జలల్లో ల్యాండ్ అయ్యే సమయంలో శుభాంశు తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు.

శుభాంశు తల్లి ఆశా శుక్లా మాట్లాడు తూ.. ‘నా కుమారుడు సురక్షితంగా తిరిగొచ్చాడు.. చాలా రోజుల తర్వాత వాడు తిరిగి రావడంతో కాస్త భావోద్వేగానికి లోనయ్యా. ఈవెంట్‌ను కవర్ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. ఈ అంతరిక్ష యాత్రతో శుభాంశు తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు. మావా డు సురక్షితంగా తిరిగి రావాలని హనుమాన్ దర్శనంతో పాటు సుందరకాండ పారాయణం చదివాను.

వాడికి ఘన స్వాగతం పలి కేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం’ అని పేర్కొన్నారు. శుభాంశు తండ్రి శంభు దయాల్ మా ట్లాడుతూ.. ‘శుభాంశు ప్రయాణించిన డ్రాగన్ సురక్షితంగా స్లాష్ అవ్వడం చరిత్ర గుర్తు పెట్టుకుంటుంది. వాడు మమ్మల్ని గర్వించేలా చేశాడు. శుభాంశు యాత్రపై దేశం మొత్తం గర్విస్తోంది.’ అని తెలిపారు. 

అంతరిక్షంలో శుభాంశు హెయిర్ కట్ 

యాక్సియం-4 మిషన్‌లో ఐఎస్‌ఎస్‌కు వెళ్లిన శుభాంశు అక్కడ ఉన్నప్పుడు ఆయన హెయిర్ కట్ చేయించుకున్న చిత్రాలు విడుదలయ్యాయి. శుక్లాకు అమెరికన్ వ్యోమగామి నికోల్ అయర్స్ హెయిర్ స్టుల్ చేశారు. అంతరిక్ష కేంద్రం లో వ్యోమగాములు స్నానం చేయడానికి వీలు ఉండదు. వారికి షవర్లు, బాత్‌టబ్స్, స్పా వంటివేవి ఉండవు. వెట్ టవల్స్‌తో శరీరాన్ని శుభ్రపరుచుకుంటారు.

ఐఎస్‌ఎస్ నుంచి పంపిన చిత్రాల్లో శుభాంశు గడ్డం కొంచెం పెరిగినట్టు కనిపించింది. ఆ తర్వాత క్లీన్‌షేవ్‌తో కనిపించారు. అక్కడ హెయిర్ స్టులింగ్ చేయించుకున్న తొలి భారతీయ వ్యోమగామి ఆయనే కావడం విశేషం. గత నెల 25న అంతరిక్ష యాత్రకు బయల్దేరిన శుభాంశు బృందం దాదాపు 18 రోజుల పాటు 60 రకాల ప్రయోగాలు చేసింది.