calender_icon.png 16 July, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో కాళేశ్వరం చేప! మురళీధర్ అరెస్ట్

16-07-2025 12:58:46 AM

నీటిపారుదల శాఖలో మరో భారీ వికెట్.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

  1. హైదరాబాద్, కరీంనగర్‌లలో 11 చోట్ల ఏకకాలంలో సోదాలు 
  2. కుప్పలుతెప్పలుగా బయటపడుతున్న అక్రమాస్తులు, విల్లాలు, ఫ్లాట్లు,
  3. వాణిజ్య భవనాలు, బెంజ్ కారు సహా అపార సంపద గుర్తింపు 
  4. జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలింపు

హైదరాబాద్/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 15 (విజయక్రాంతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్‌సీ(ఇంజినీర్ ఇన్ చీఫ్) మురళీధర్‌రావును మంగళవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఉదయం ఆయ న్ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ.. మురళీధర్‌రావుతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 11 చోట్ల తనిఖీలు నిర్వహించారు.

ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్‌లలోని ఆయన నివాసాలు, ఆయన బంధువుల ఇళ్లపై దాడులు చేసింది. 11చోట్ల చేపట్టిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కీలకమైన దస్తావేజులు, బంగారం, నగదును అధికారులు స్వాధీనం చేసుకుని, మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు.

మురళీధర్‌రావు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి సంపాదించినట్లు సోదాల్లో వెల్లడైందని ఏసీబీ తెలిపింది. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, పత్రాల విలువ ప్రకారం ఉన్న ఆస్తుల వాస్తవ మార్కెట్ విలువ ప్రకారం చాలా రెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తోంది. మురళీధర్‌రావును అరెస్ట్ చేసి, జ్యుడీషియల్ రిమాండ్ తరలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.

రిటైర్ అయినా పదేళ్లు చలాయించారు..

నీటిపారుదల శాఖ మాజీ ఈఎన్సీ మురళీధర్‌రావు ఉమ్మడి రాష్ట్రంలోనే 2013లో పదవీ విరమణ చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన తిరిగి సాగునీటి ప్రాజెక్టుల ఈఎన్సీ(జనరల్)గా పదవిలోకి వచ్చారు. పదేళ్ల పాటు ఆయనే ఆ పదవిలో కొనసాగారు. రిటైరైనా తిరిగి అదే పోస్టులోకి వచ్చి మొత్తం వ్యవహారం నడిపించారు. ఆయన హయాంలోనే రాష్ట్రం లో దాదాపు రూ.2లక్షల కోట్లకుపైగా సాగునీటి ప్రాజెక్టుల పనులు జరిగాయి.

కాంగ్రెస్ సర్కారు అధికారంలో కి వచ్చిన తర్వాత కూడా ఆయనే ఈఎన్సీగా కొనసాగారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ కుంగుబాటుతో పాటు కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ఆయన తీరుతో అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రస్తుత ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని ఆదేశించడంతో గత ఏడాది ఫిబ్రవరి 8న రాజీనామా చేశారు. ఫిబ్రవరి 13న ఆయన రాజీనామాను సర్కారు ఆమోదించింది.

పదేళ్లపాటు ఈఎన్సీ జనరల్‌గా పనిచేసిన ఆయన అంతా తానై వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అప్పటి సీఎం కేసీఆర్, మొదటి విడతలో సాగునీటి మంత్రిగా చేసిన హరీశ్‌రావు తర్వాత ప్రాజెక్టులపై పూర్తి వ్యవహారాలన్నీ మురళీధర్ రావు కనుసన్నల్లోనే జరిగాయని నీటిపారుదలశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే తన కుమారుడి కంపెనీకి సబ్ కాంట్రాక్టులను పెద్దఎత్తున మళ్లించి సొమ్ముచేసుకున్నారనే ఆరోపణలు ఉన్నా యి.

అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కీలకంగా ఉన్న మురళీధర్‌పై ప్రస్తుత ప్రభుత్వం చాలా ఆలస్యంగా చర్యలకు ఉపక్రమించిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కాస్త ముందుగానే ఆయనపై ఏసీబీ దా డులు జరిగితే మరుగున పడిపోకుండా మరిన్ని కీలక విషయాలు వె లుగులోకి వచ్చేవని ఇరిగేషన్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇదీ చిట్టా..

కొండాపూర్: విలాసవంతమైన విల్లా.. బంజారాహిల్స్, యూసుఫ్‌గూడ, బేగంపేట,

కోకాపేట్: ఒక్కో ఫ్లాట్ కరీంనగర్,

హైదరాబాద్: ఒక్కో వాణిజ్య భవనం

కోదాడ: అపార్ట్‌మెంట్

వరంగల్: నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్

జహీరాబాద్: 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్రాజెక్ట్

హైదరాబాద్ శివారు: 11 ఎకరాల వ్యవసాయ భూమి

హైదరాబాద్: అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో 4 నివాసయోగ్యమైన ఓపెన్ ప్లాట్లు

మోకిల: 6,500 గజాల విశాలమైన స్థలం మూడు కార్లు (ఒక మెర్సిడెస్ బెంజ్‌తో సహా) భారీగా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు