16-07-2025 12:35:44 AM
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): మారిన జీవనశైలి, అందుబాటులోకి సాంకేతికత రావడంతో కొత్తగా వ్యాపార రంగం మీదకు గిగ్ వర్కర్ల వ్యవస్థ వచ్చింది. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా ఫుడ్‌ను డెలివరీ చేసే వాళ్లు, బైకులు, ఆటోలు, కార్లు ద్వారా రవాణా రంగంలోకి వచ్చినవారు, ప్లంబర్, ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, భవన నిర్మాణ కార్మికులు తదితరులు గిగ్ వర్కర్లుగా ఉన్నారు.
ఈ రంగంలోకి పెద్దఎత్తున నిరుద్యోగులు రోజురోజుకూ వచ్చి చేరుతున్నారు. దేశంలో దాదాపుగా ఎనభై లక్షలకు పైగా గిగ్ వర్కర్లు ఉపాధి పొందుతున్నారు. రాబోయే ఐదేళ్లలో వీరి సంఖ్య 2 కోట్ల 35 లక్షల వరకు చేరు కుంటుందన్న అంచనాలున్నాయి. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్న సందర్భంలో గిగ్ వర్కర్లు ఆయన్ని కలిశారు. రాహుల్‌గాంధీ ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు.
గిగ్ వర్కర్లకు హక్కులు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీంతో గిగ్ వర్కర్ల సమస్యలు, వారి సంక్షేమంపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నా యి. రాహుల్‌గాంధీ హామీ మేరకు రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లట్ కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా గిగ్ వర్కర్ల చట్టం తీసుకువచ్చారు. రాజస్థాన్ అసెంబ్లీ చరిత్రాత్మక రాజస్థాన్ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్ మరియు వెల్ఫేర్) బిల్లు 2023ను ఆమోదించింది.
అలాగే కర్ణాటక కూడా ఇటీవలనే గిగ్ వర్కర్ల కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అందులో 4 లక్షల జీవిత బీమా, ప్రమాదబీమాను ఆ ప్రభుత్వం చేర్చింది. వీరి ప్రధాన సమస్య ఉద్యోగ భద్రత. ఏ క్షణం ఉద్యోగం ఊడుతుందో తెలియదు. వీరికి సెలవులు, ఆరోగ్య బీమా, నిర్ణీత పనిగంటలు, పింఛన్ సదుపాయాలు ఉండటం లేదు. ఫుడ్ డెలవరీ, ట్రాన్స్‌పోర్టుల యా ప్‌ల ద్వారా పనిచేసే వారు కాలంతో పనిచేయాల్సి ఉంటుంది.
రోడ్డు ప్రమాదాలు కూడా ప్రధాన సమస్యగా ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమ యంలో గిగ్ వర్కర్లకు హక్కులు, భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి గిగ్ వర్కర్లు, అగ్రిగేటర్లతో భేటీ అయ్యారు. వారి నుంచి అనేక సూచనలు అభిప్రాయాలు తీసుకున్నారు. కార్మికశాఖ గిగ్ వర్కర్ల సంక్షే మ కోసం అనేకసార్లు సమావేశాలు నిర్వహించి ముసాయిదా బిల్లు రూపకల్పనకు కార్యాచరణ తీసుకున్నారు.
కదలికలేని బిల్లు..
రాహుల్ హామీ, సీఎం రేవంత్ కార్యాచరణతో తమకు ఓ సంక్షేమ బోర్డు వస్తుందన్న ఆశలో గిగ్‌వర్కర్లు ఉన్నారు. అయితే ప్రభుత్వం నుంచి అనుకున్న స్థాయిలో కదలిక లేకపోవడంతో వారు నిరాశకు లోనవుతున్నారు. ముసాయిదా బిల్లును ఇటీవల క్యాబినెట్‌లో పెడతామని హామీ ఇచ్చారు కానీ, క్యా బినెట్ అజెండాలోకి గిగ్‌వర్కర్ల బిల్లు రాకపోవడం తో వర్కర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రం లో నాలుగున్నర లక్షల మంది గిగ్ వర్కర్లు ఉన్నారు. కనీస వేతనాలు చెల్లించడం, గుర్తింపు కార్డులను బ్లా క్ చేయడం వంటి అంశాలు గిగ్‌వర్కర్ల నుంచి ప్రభుత్వానికి పాలసీలో చేర్చాలని విజ్ఞప్తులు అందాయి. పాలసీపై పబ్లిక్ డోమైన్‌లో పెడితే 66 సూచనలు ప్రభుత్వానికి అందాయి.
గిగ్‌వర్కర్ల రిజిష్ర్టేషన్లు, పనిదినాలు, సామాజిక భద్రత, సంక్షేమ నిధి ఏర్పా టు, బిల్లింగ్‌పైన కొంతశాతం మేర సెస్ విధింపును కంపెనీలు, వినియోగదారులు భరించే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.
త్వరగా బిల్లు ప్రవేశపెట్టాలి..
రాహుల్‌గాంధీ మాకు హామీ ఇచ్చినట్లుగా మాకు సంక్షేమ బోర్డు, కనీస వేతనాలు.. బిల్లులో పొందుపర్చాలని కోరాం. దీనిలో డ్రైవర్లకు కిలోమీటర్‌కు 21 రూపాయలు చెలించాలి. డెలివరీ వ్యక్తులకు 4కిలోమీటర్ల లోపు 35 రూపాయలను చెల్లించాలి. పండుగలు, ఉత్సవాల సమయంలో తమకు ఇచ్చే డబ్బును పెంచి ఇవ్వాలి. బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది.
మొదట మేడే రోజు అన్నారు.. ఆ తర్వాత జూన్ రెండో తేదీన అన్నారు.. ఇప్పుడేమో అసెంబ్లీ సమావేశాల లోపు ఇస్తామంటున్నారు. కానీ, పనులు వేగంగా జరగటం లేదు. ఏర్పాటు కాబోయే బోర్డులో ఉద్యోగ భద్రత, వైద్య చికిత్సలు, జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, పీఎఫ్ ఇతర ఉద్యోగులు, కార్మికుల మాదిరిగా అందజేయాలి.
షేక్ సలాఉద్దీన్, అధ్యక్షుడు,
తెలంగాణ గిగ్ ప్లాట్‌ఫాం యూనియన్