calender_icon.png 16 July, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డేంజర్‌లో జనరల్ డిగ్రీ

16-07-2025 12:40:35 AM

  1. ప్రశ్నార్థకంగా కాలేజీల మనుగడ.. మూసివేత దిశగా అడుగులు
  2. సాధారణ డిగ్రీ చేయడానికి ఆసక్తిచూపని విద్యార్థులు 
  3. పేరుకుపోయిన ఫీజుల భారంతో కష్టంగా మారుతున్న నిర్వహణ
  4. నగరం చుట్టుపక్కల కాలేజీల్లోనే నిండుతున్న సీట్లు..
  5. మిగతా ప్రాంతాల్లో ఒక్క సీటు కూడా నిండని కాలేజీలు ఎన్నో..
  6. భారీగా కాలేజీలు మూతపడుతాయంటున్న యాజమాన్యాలు

హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): ప్రైవేట్ డిగ్రీ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఒకవైపు డిగ్రీ కోర్సులకు ఆదరణ కరువ వడం, మరోవైపు ఫీజు బకాయిలు పేరుకుపోతుండటంతో తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొంటున్నాయి. కొన్ని కాలేజీ ల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా నిండలేదు. ఇప్పటివరకు డిగ్రీ అడ్మిషన్లు మూడు విడతల్లో చేపట్టారు. 957 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలుంటే అందు లో 64 డిగ్రీ కాలేజీల్లో 20,260సీట్లకు ఒక్క అడ్మిషన్ కూడా జరగలేదు.

మరో వంద వరకు కాలేజీల్లో అతితక్కువగా అడ్మిషన్లు నమోదయ్యాయి. అడ్మిషన్లు జరగకుండా కాలేజీలను నడపడం సాధ్యమయ్యే పనికాదు. దీనికి తోడూ నిర్వహణ భారం తడిసిమోపెడవుతుండటంతో డిగ్రీ కాలేజీల పరిస్థితి మూసివేత దిశగా అడుగులు పడుతున్నాయి. 2016-17లో దాదాపు 1,200 కాలేజీలుండేవి. ఇప్పుడా సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. వచ్చే విద్యాసంవత్సరంలో మరో 50 నుంచి వంద కాలేజీలు మూతపడే దిశలో ఉన్నాయని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. 

ఆసక్తి చూపని విద్యార్థులు..

సాధారణ డిగ్రీ చేసేవారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దీని ప్రభావం కాలేజీల నిర్వహణపై పడుతోంది. విద్యార్థులు చేరితేనే కళాశాలలు నడిపేది. కానీ ప్రతి ఏటా సీట్లు 40 శాతం కూడా నిం డట్లేదు. రాష్ట్రంలో మొత్తం 4,36,947 సీట్లుంటే, అందులో నిండింది 1,41,590 (32.40 శాతం) మాత్రమే. అదికూడా హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఉండే డిగ్రీ కాలేజీల్లోనే కాస్త సీట్లు నిం డుతున్నాయి.

ఇక గ్రామీణ ప్రాంతాల్లోని డిగ్రీ కాలేజీలైతే తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నా యి. డిగ్రీ కోర్సులను అందించే వాటిలో ప్రధానమైన యూనివర్సిటీలు ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహ న, తెలంగాణ, వీరనారి చాకలి ఐలమ్మ వర్సిటీలున్నాయి. అయితే ఉస్మానియా వర్సిటీ పరిధిలోని 13 ప్రైవేట్ కాలేజీలు, కాకతీయ పరిధిలోని 22, మహాత్మాగాంధీ పరిధిలోని 14, పాలమూరు వర్సిటీ పరిధిలో 5, శాతవాహన పరిధిలో ఒకటి, తెలంగాణ వర్సిటీ పరిధిలో 8 ప్రైవేట్ కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు నమోదవడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది.

ఈ కాలేజీల్లో 20 వేలకుపైగా సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. ఇంటర్ తర్వాత సాధారణ డిగ్రీ కోర్సుల్లో విద్యార్థులు చేరడంలేదు. డిగ్రీ కోర్సుల కంటే ఇతర వృత్తి విద్యా కోర్సులపై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్, వైద్య విద్యా, బీఫార్మసీ, ఫార్మ్‌డీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సుల వైపు వెళ్తున్నారు.

ఒకవేళ డిగ్రీ కాలేజీల్లో చేరాలనుకున్నా అటానమస్ కాలేజీల్లో ఎక్కువగా చేరుతు న్నారు. దీంతో సాధారణ కాలేజీల్లో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశ పెడుతున్నాగానీ డిగ్రీ అంటేనే విద్యార్థులు వెనుకడుగు వేస్తున్నారు. 

ఆర్థిక ఇబ్బందుల్లో కాలేజీలు..

ప్రభుత్వం ప్రతీ సంవత్సరం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సకాలంలో యాజమాన్యాలకు విడుద ల చేస్తే కాలేజీలు మూసివేసే పరిస్థితి ఉండదు. కానీ గత మూడేళ్లుగా డిగ్రీ కాలేజీలకు రావాల్సిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. 2022- 23, 2023-24, 2024-25 విద్యాసంవత్సరానివే దాదాపు రూ.1,500 కోట్లు బకాయిలున్నా యి. దీనికితోడూ రూ.650 కోట్లకు టోకెన్లు ఇప్పటికే విడుదల చేశారు.

గతేడాది డిసెంబర్‌లో రూ. 100కోట్ల వరకు పెండింగ్ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పాతబకాయి లన్నింటినీ 12 వాయిదాలుగా విభజించి చెల్లిస్తామని చెప్పి నాలుగు నెలలవు తున్నా ఇంతవరకూ అతీగతీ లేదని ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. ఫీజు రీ యింబర్స్‌మెంట్ విడుదల కాకపోవడంతో కాలేజీలను నడపడం భారంగా మారుతోంది. సిబ్బంది జీ తాలు, అద్దెలు, ఇతరత్రా ఖ ర్చులు తడిసిమోపెడవుతు న్న పరిస్థితి ఉంది.

దీనికితోడూ ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం వెలుపల ఉ న్న కొద్దిమంది విద్యార్థులు కూడా సకాలంలో ఫీజులు చెల్లించ కపోవడంతో కాలేజీల నిర్వహణ భారంతో అ ప్పుల పాలవుతున్నారు. అద్దె భవనాల్లో కొన సాగు తున్న మెజార్టీ కళాశాలల అద్దెను, సొంత భవనాలు నిర్మించిన యాజామాన్యా లు బ్యాంక్ ఈఎంఐలను చివరికి విద్యు త్ బిల్లులను కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామని యాజమాన్యా లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

వచ్చే ఏడాది వంద కాలేజీలు మూతపడతాయి

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు మొత్తం చెల్లిస్తామని హామీ ఇచ్చి నాలుగు నెలలవుతోంది. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులను కలిసి ఇప్పటికే మా సమస్యను వివరించాం. వాయిదాల పద్ధతుల్లో చెల్లిస్తామని చెప్పి నాలుగు నెలలవున్నా బకాయిలను విడుదల చేయలేదు.

కనీసం గతంలో జారీ చేసిన రూ.650 కోట్ల టోకెన్ల డబ్బులైన విడుదల చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం మాట విని పరీక్షలను నిర్వహించాం. లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. బకాయిల విషయంలో ఇక ఉపేక్షించం. పోరుబాట చేపడుతాం. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం. వచ్చే విద్యాసంవత్సరంలో వంద వరకు కాలేజీలు మూతపడబోతున్నాయి.

 బీ సూర్యనారాయణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు,

ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్