ఎమ్మెల్యే పదవికి సిక్కిం సీఎం భార్య గుడ్‌బై
న్యూఢిల్లీ, జూన్ 14: సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ సతీమణి క్రిష్ణకుమారి రాయ్ తన ఎమ్మెల్యే పదవికి శుక్రవారం రాజీనామా చేశారు. ఆమె నామ్‌చి సింఘితాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి కొద్దిరోజుల క్రితమే ఎమ్మెల్యేగా గెలిచారు. గురువారమే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. మరుసటి రోజే రాజీనామా చేయ టం గమనార్హం. లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగిన సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) రాష్ట్రంలోని 32 అసెంబ్లీ స్థానాలకుగాను 31 చోట్ల విజయం సాధించి రికార్డు సృష్టించింది. రాష్ట్రంలోని ఒకే ఒక్క లోక్‌సభ సీటు ను కూడా ఆ పార్టీయే గెలుచుకొన్నది. అయితే, అందరి ఏకాభిప్రా యంతోనే తన భార్య ఎమ్మెల్యే పదవిని వదులుకొన్నారని తమాంగ్ తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న మరొకరికి అవకాశం ఇచ్చేందుకే ఆమె రాజీనామా చేశారని చెప్పారు.






