పీఏసీఎస్‌లకు పాలక మండళ్లు అప్రజాస్వామికం
పాల్వంచ, మే 15, (విజయక్రాంతి) : ప్రాథమిక సహకార సంఘాలకు(పీఏసీఎస్)ఎన్నికలు జరుపకుండా రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు నిర్వహించాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం డిమాండ్ చేశారు.
శుక్రవారం ఏఐకేఎస్ ఆధ్వర్యంలో సహకార సంఘాలకు ఎన్నికల నిర్వహించాలని, ఆంక్షలు లేకుండా పంటలు కొనుగోలు చేయాలిని, సిసిఐ కేంద్రాల వద్ద సరిపడా బస్తాలు అందుబాటులో ఉంచాలని, తమ, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున వారి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో రైతులతో కలిసి ప్రదర్శనగా తహసిల్దార్ కార్యాలయంకు చేరుకొని ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండళ్లను నియమించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్దమని విమర్శించారు. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పాలకమండళ్ల నియామకం సరికాదు అన్నారా. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రతీ సహకార సంఘంలో పాలకపార్టీకి చెందిన సభ్యులను అధ్యక్షులుగా, డైరక్టర్లుగా నామినేట్ చేయాలని ఉద్దేశ్యంతో రాజ్యాంగ విరుద్ధచర్యలకు పూనుకుంటున్నారని మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 జెడ్ హెచ్ ప్రకారం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యతని పేర్కొన్నారు. సహకార సంఘంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, రైతులు, కార్మికులు ఐఖ్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడుసుమిల్లి సాయిబాబా, వీసంశెట్టి పూర్ణచంద్రరావు ఉప్పుశెట్టి రాహుల్, జిల్లాసమితి సభ్యులు వీసంశెట్టి విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






