24 April, 2026 | 5:47 PM

బలగాన్ని మరిసినావా మొగులయ్యా!

20-12-2024 12:59 AM
  1. తెలంగాణ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూత
  2. 'బలగం’ సినిమాలో క్లుమైక్స్ పాట ద్వారా పేరు ప్రఖ్యాతలు
  3. జీవితకాలంలో 40 వేలకు పైగా బుర్రకథ ప్రదర్శనలు
  4. మృతికి సీఎం రేవంత్‌రెడ్డి, సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం

జనగామ, డిసెంబర్ 19 (విజయక్రాంతి) : తెలంగాణ జానపద కళాకారుడు, ‘బలగం’ మూవీ ఫేం బలగం మొగిలయ్య(67) తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతుండగా, కుటుంబ సభ్యులు ఆయనకు వరంగల్‌లోని సురక్షా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మొగిలయ్య కన్నుమూశారు. కుటుంబ సభ్యులు సాయంత్రం బంధుమిత్రులు, అభిమానుల మధ్య స్వస్థలం దుగ్గొండిలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన మొగిలయ్యకు చిన్నప్పటి నుంచి జానపద కళలంటే ఆసక్తి.

వీరి కుటుంబం బేడ బుడగ జంగాల సామాజిక వర్గానికి చెందినది. మొగిలయ్య ముందుతరం వారంతా బుర్రకథలు చెబుతూ జీవనం సాగించేవారు. అదే వారసత్వాన్ని మొగిలయ్య కూడా అందిపుచ్చుకున్నారు. బుర్రకథలు చెప్తూ చెప్తూ ఆయన కుటుంబం దుగ్గొండి మండల కేంద్రానికి వలస వచ్చి అక్కడే స్థిరపడింది.

గతేడాది జబర్దస్త్ ఫేం వేణు దర్శకుడిగా పరిచయమైన ‘బలగం’ చిత్రంతో మొగిలయ్యకు గుర్తింపు వచ్చింది. ఆ చిత్రం క్లుమైక్స్‌లో మొగిలయ్య దంపతులు పాడిన ‘తోడుగా మా తోడుండి’ పాట ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. మొగిలయ్య మరణంతో తెలంగాణ సమాజం శోకసంద్రంలో మునిగింది. 

రెండేళ్లుగా చావుబతుకులతో పోరాటం..

బలగం మొగిలయ్య రెండేళ్లుగా చావుబతుకుల మధ్య పోరాడారు. బలగం సినిమా హిట్ అయిన కొన్ని రోజులకే ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో మంచం పట్టారు. ఎన్నో ఏళ్లుగా బీపీ, షుగర్‌తో బాధపడుతున్న మొగిలయ్యకు మూడేళ్ల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ ప్రభావం కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపింది. క్రమంగా రెండేళ్ల క్రితం ఆయన్ను పలు రకాల రుగ్మతలు చుట్టుముట్టాయి.

ఈ క్రమంలో రెండు కిడ్నీలు పాడయ్యాయి. ఆయనకు డయాలసిస్ తప్పనిసరి అయింది. మొగిలయ్యను బతికించుకునేందుకు భార్య కొమురమ్మ ఎంతో కష్టపడింది. ఆస్పత్రుల చుట్టూ తిప్పుతూ ఆయన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నది. వైద్యులు ఆయన ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడంతోనే ఆయన ఇన్ని రోజులు బతకగలిగారు. 

అండగా నిలిచిన ప్రభుత్వాలు, నాయకులు..

బలగం మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని గమనించి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అండగా నిలిచింది. ఆయనకు కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు కల్పించింది. మొగిలయ్య వైద్యఖర్చుల కోసం బలగం చిత్ర యూనిట్‌తో పాటు నటుడు, దర్శకుడు వేణు, సినీ స్టార్ చిరంజీవి, మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఆర్థికసాయం చేశారు. గతంలో బీఆర్‌ఎస్ నేతలు హరీశ్‌రావు, వినయ్‌భాస్కర్, పెద్ది సుదర్శన్‌రెడ్డి  ఎంతో చొరవ చూపి కుటుంబానికి అండగా నిలిచారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌లో మొగిలయ్యను చేర్పించారు.

పొన్నం సత్తయ్య పురస్కారం...

పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు మూడు నెలల క్రితం పొన్నం సత్తయ్య స్మారక జీవన సాఫల్య పురస్కారం లభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ తన తండ్రి స్మారకార్థం ఏటా వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి పురస్కారం అందిస్తున్నారు. అనారోగ్యం కారణంగా మొగిలయ్య సత్కార కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా అతిథుల చేతులమీదుగా కొమురమ్మ పురస్కారాన్ని అందుకున్నారు.  కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ పాల్గొని కొమురమ్మను సన్మానించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సభావేదిక నుంచే మొగిలయ్య కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.

వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే చూసుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం రూ.51 వేల ఆర్థిక సాయం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సైతం రూ.లక్ష సాయం చేస్తానని మాటిచ్చారు. అన్నట్లే కొమురమ్మను తన ఇంటికి పిలిపించుకుని మరీ ఆ మొత్తం అందించారు.

40 వేలకు పైగా ప్రదర్శనలు..

 మొగిలయ్య, కొమురమ్మ దంపతులు తాతల నుంచి వారసత్వంగా వచ్చిన బుర్రకథలనే జీవనాధారంగా మలుచు కున్నారు. 40 ఏళ్ల నుంచి ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 వేలకు పైగా ప్రదర్శనలిచ్చారు. మొదట్లో ఊరూరూ తిరుగుతూ బుర్రకథలు చెప్పి వచ్చిన డబ్బులతో జీవనం సాగించేవారు. తర్వాత తమ ప్రదర్శనకు టికెట్ పద్ధతి ప్రవేశపెట్టారు.

సుగుణావతి, మైలావతి, అరి చక్రవర్తి, పురూరవ చక్రవర్తి, నల మహారాజు, ధనలక్ష్మి, భూలక్ష్మి, నల దమయంతి, ఆడబిడ్డ అంజమ్మ, శనియాచమ్మ, భాగ్యలక్ష్మి, అరుణావతి, కళావతి, సుగుణావతి, చంద్రాచల విలాసం, సూర్యుడు, చంద్రుడు, హరిశ్చంద్ర, బాలనాగమ్మ, బొంగు కళావతి.. ఇలా ఒకటేమిటి వందలాది బుర్రకథలను అవలీలగా ప్రదర్శించేవారు.

మొగిలయ్య చేతిలోని తంబురాకు ప్రత్యేకత ఉంది. ఆయన తాత బతికి ఉన్నంత వరకూ అదే తంబురా వాడాడు. తర్వాత తన తండ్రి, సోదరుడు వినియోగించారు. వారి నుంచి వారసత్వంగా మొగిలయ్య చేతిలోకి తంబూరా వచ్చింది. ఈ తంబురా శతాబ్దం తుమ్మ టేకుతో చేయించారని ఓ సందర్భంలో మొగిలయ్య చెప్పారు.

సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి..

బలగం మొగిలయ్య మృతిపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తంబూరా వాయిస్తూ.. బుర్రకథలు చెబుతూ మొగిలయ్య కొమురమ్మ దంపతులు ఇచ్చిన ప్రదర్శనలు వెలకట్టలేనివని సీఎం కొనియాడారు. బలగం సినిమాలో క్లుమైక్స్ పాట తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని, ఆయన మృతి సాహిత్య రంగానికి తీరని లోటని అన్నారు.

మొగిలయ్యకు సంతాపం ప్రకటిస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు, కళాకారులు కొమురయ్య మృతికి సంతాపం ప్రకటించారు.