11 August, 2026 | 3:29 AM

నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలం

19-06-2024 11:28 AM

హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య మీద, విద్యార్థుల భవిష్యత్తు మీద ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని విమర్శించారు. 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు మండిపడ్డారు.

రాష్ట్రంలోని కొన్ని జూనియర్ కాలేజీల్లో మొదటి ఏడాది జీరో అడ్మిషన్స్ నమోదవడం పట్ల ప్రభుత్వం దృష్టి సారించి ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో పాటు, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1654 గెస్ట్ ఫ్యాకల్టీ రెన్యువల్  చేయాలని, రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జూనియర్ కాలేజీల్లో పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన హరీశ్ రావు ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు.