9 July, 2026 | 1:55 AM

మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

09-07-2026 01:29 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూలై 8 (విజయక్రాంతి): మైనారిటీల సంక్షేమానికి, మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుదవారం జిల్లా కేంద్రంలోని మంజూర్ నగర్ లో  తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్  ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం కింద మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  ముఖ్య అతిథిగా విచ్చేసి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి లబ్ధిదారులకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ  ఆశయాలకు అనుగుణంగా మహిళలు స్వయం ఉపాధి సాధించి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు. మైనారిటీ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా నిలవాలని పిలుపునిచ్చారు. 

ఇందిరమ్మ మైనారిటీ మహిళ శక్తి పథకం కింద  నియోజకవర్గం నుంచి 275 మంది దరఖాస్తు చేసుకోగా, ప్రతి ఒక్కరికి కుట్టు మిషన్స్ అందచేస్తామన్నారు.  రంజాన్ పండుగ సందర్భంగా తోఫా ఇస్తున్నామని, 50 మసీదులు నిర్మాణానికి ఒక్కొక్క మసీదుకు 30 వేలు చొప్పున మంజూరు చేసినట్లు తెలిపారు.  మైనారిటీ గురుకులం అద్దె భవనంలో ఉండగా  పాత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మార్చినట్లు తెలిపారు. 402 మంది మైనార్టీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ  మాట్లాడుతూ

జిల్లాలోని అర్హులైన ప్రతి మైనారిటీ మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా జిల్లా యంత్రాంగం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం మైనారిటీ గురుకులాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి సాయంత్రం అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ  అధికారి డాక్టర్ కుమార స్వామి, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, కో ఆప్షన్  సభ్యులు తదితరులు పాల్గొన్నారు.