13 May, 2026 | 2:13 AM

అక్రమార్కుల గుప్పిట్లో ప్రభుత్వ భూమి!

13-05-2026 12:36 AM
  1. అధికారుల తీరుపై గోకారం సర్పంచి ఆగ్రహం.
  2. తహసీల్దార్తో వాగ్వాదం.. పంచనామా అడ్డుకున్న గ్రామస్తులు. 

చారకొండ, మే 12: గోకారం గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని, పైగా ఆక్రమణదారులకే వత్తాసు పలుకుతున్నారని గ్రామ సర్పంచి పరశురాములు ఆరోపించారు. మంగళవారం మండలంలోని వివాదాస్పద స్థలాన్ని తహసీల్దార్ ఉమ పరిశీలించగా, అక్కడ సర్పంచికి, తహసిల్దార్ కు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 421లో జమ్ముల నారయ్యకు అసైన్మెంట్ పట్టా ఉందని, ఆ భూమిని సాగు చేసుకుంటూనే గ్రామంలోని ఇతర ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇల్లు కట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని సర్పంచి తెలిపారు.

గతంలోనే అప్పటి తహసీల్దార్ నాగమణికి ఫిర్యాదు చేయగా, సర్వే నిర్వహించి అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించి హద్దులు కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అక్కడ మహిళా సమాఖ్య భవనం, బీసీ భవన నిర్మాణాల కోసం ఇసుక కూడా పోయించామని వివరించారు. పాత రికార్డులను పక్కనపెట్టి, ఆక్రమణదారులకు అనుకూలంగా బలవంతంగా సంతకాలు పెట్టించుకుని తహసీల్దార్ పంచనామా చేసేందుకు ప్రయత్నించడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తగదని, పారదర్శకంగా సర్వే చేయకుండా ఆక్రమణదారులకు భూమిని కట్టబెట్టడం ఏంటి? అని సర్పంచి అధికారులను ప్రశ్నించారు. గ్రామంలోని ఎంతో మంది నిరుపేదలు ఉన్నారని వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. పారదర్శక సర్వే జరగకపోతే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.