ఆశ వర్కర్లలపై ప్రభుత్వం చిన్నచూపు
ఆదిలాబాద్, ఏప్రిల్ ౧౩ (విజయక్రాంతి): ఆశ వర్కర్లతోనే ప్రజల ఆరోగ్యం మెరుగుపడుతుందని, అలాంటి ఆశల పైన రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడం సమంజసం కాదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అనుబంధ కార్మిక సంఘం బీ.ఆర్.టి.యు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశ వర్కర్లల సమావేశానికి రాష్ట్ర నాయకులు రాం బాబు, ఆశ వర్కర్ యూనియన్ ప్రెసిడెంట్ సంతోష్ లతో కలిసి మాజీ మంత్రి జోగు రామన్న ముఖ్య అతిథిగా హాజరై ఆశల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
అనంతరం మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ... కేసీఆర్ ప్రభుత్వంలో ఆశ వర్కర్ల సేవలను గుర్తించి వారికి ఒకటో తారీకునా వేతనాలు అందించిందన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్లను చిన్న చూపు చూస్తూ వేతనాలు సైతం చెల్లించకుండా ఆశ కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఆశ వర్కర్లకు ఎల్లవేళలా అండగా ఉంటుందని వారి సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేపడతామని బరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రూ. 18 వేల వేతనాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు కనీసం వేతనాలను కూడా అందించకపోవడం సిగ్గుచేటని మద్దిపడ్డారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు సరస్వతి, జిల్లా ఇన్చార్జ్ అశోక్, వీణ పాల్గొన్నారు.






