calender_icon.png 17 January, 2026 | 11:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలి

17-01-2026 10:08:28 PM

తహసిల్దార్ స్రవంతి

గరిడేపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించే దిశగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,వాటి పరిధిలో పనిచేసే సిబ్బంది కృషి చేయాలని గరిడేపల్లి మండల తహసిల్దార్ స్రవంతి కోరారు. గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నిర్వహించిన జన ఆరోగ్య సమితి సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. జన ఆరోగ్య సమితి లక్ష్యాలను సాధించడంలో వైద్య ఆరోగ్య సిబ్బంది,ఆశా కార్యకర్తల పాత్ర కీలకమైందన్నారు.ప్రభుత్వం అందించే లక్ష్యాలను సకాలంలో పూర్తి చేసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బందికి, ఆశ కార్యకర్తలకు సంబంధిత పరిధిలోని గ్రామ ప్రజలు, ప్రజా ప్రతినిధులు సహాయ సహకారాలు అందించాలని కోరారు.

మండల వైద్యాధికారి నరేష్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు అన్ని జాతీయ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరంతరం గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. గ్రామాలలో బిపి షుగర్ పరీక్షలు క్రమం తప్పకుండా చేస్తూ సంబంధిత బాధితులకు మందులు ఇవ్వడం జరుగుతుందని, దీంతోపాటు చిన్న పిల్లలకు, గర్భిణీలకు నిర్దేశించిన విధంగా టీకాలు వేయిస్తున్నట్లు తెలిపారు. జన ఆరోగ్య సమితి కార్యక్రమం రాయిని గూడెం, తాళ్ల మల్కాపురం, కాల్వపల్లి, అబ్బిరెడ్డిగూడెం, ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సంబంధిత గ్రామపంచాయతీలకు నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉపసర్పంచుల చేతుల మీదుగా ఆశా కార్యకర్తలకు చీరల పంపిణీ జరుగుతుందని తెలిపారు. జన ఆరోగ్య సమితి సమావేశంలో భాగంగా గరిడేపల్లి, వెంకటరాంపురం గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ లు మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్, వెంకటరమణ బుచ్చిబాబు, ఉప సర్పంచులు సంజీవ, సైదులను గరిడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సన్మానించారు. అనంతరం నూతన సర్పంచులు ఉపసర్పంచ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు చీరలు పంపిణీ చేశారు.