16-05-2025 12:15:25 AM
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
వికారాబాద్, మే 15: ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు అయ్యే విధంగా అధికారులు పని చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తెలిపారు. గురువారం కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లాలో వివిధ శాఖల పనితీరు, చేపట్టాల్సిన వివిధ అంశాలపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ డి.ఎస్.చౌహన్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ లతో కలిసి సమీక్షించారు.
ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు మాట్లాడుతూ...రాష్ట్ర ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి వారికి అందేలా అధికారులు పనిచేయాలన్నారు. ఒక్క శాతం ఉన్న ఉద్యోగులుగా మనం 99 శాతం ఉన్న ప్రజలకు సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూ చించారు.
రైతులు సన్న రకం బియ్యాన్ని పండించే విధంగా ప్రోత్సహించాలని తెలుపుతూ, సన్న బియ్యం పండించే వారికి అదనంగా 500 రూపాయలు బోనస్ ఇవ్వడంతో పాటు అన్ని కుటుంబాలకు పోషక ఆహారాన్ని అందించే లక్ష్యంగా చౌక ధర దుకాణంల ద్వారా సన్న బియ్యాన్ని ప్రజలకు ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అన్నారు.
రాజీవ యువ వికాస్ పథకం ద్వారా యువతకు ఉపాధి కలిగేలా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు. రైతు భరోసా, రుణమాఫీ పథకం వివరాలను ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖ అధికారిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని అదే విధంగా విద్యార్థుల్లో మానసిక వికాసాన్ని పెంపొంచేవిధంగా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా పారిశుధ్య వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వ కార్యదర్శి అధికారులకు సూచించారు. ప్రభుత్వం రెవిన్యూ సమస్యలు పరిష్కరించే దిశగా భూ భారతి చట్టం ద్వారా వెసులుబాటు కల్పించిందని, ప్రజల సమస్యల పరిష్కార దిశగా అధికారులు అంకితభావంతో పని చేయాలని అధికారులకు ఆయన సూచించారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, ఆర్డిఓ వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.