16-05-2025 12:16:21 AM
శస్త్రచికిత్సలతో పోలిస్తే ‘గామా నైఫ్’తో అనేక ప్రయోజనాలు
హైదరాబాద్, మే 15: మెదడులో వచ్చే సమస్యలకు సంబంధించి క్యాన్సర్ మెటాస్టాటిస్ కణితులను శస్త్రచికిత్సతో తొలగించడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు గామానైఫ్ చికిత్స చాలా ప్రయోజనకరం. ఇందు లో రేడియేషన్ కిరణాలను కేంద్రీకరించి పం పుతారు. మొత్తం 192 గామా కిరణాలను మెదడులో ఒకేచోటుకు పంపుతారు.
దీనివల్ల ప్రభావిత ప్రాంతం మీద అధికమోతా దులో రేడియేషన్ అందుతుంది. చుట్టుపక్కల కణజాలాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. చికిత్సకు ముందు రోగి తల కదలకుండా ఉండేందుకు ఒక ఫ్రేమ్ పెడతారు. గామా కిరణాలు సరిగ్గా ఎక్కడ పడాలో చూస్తారు. ఏమాత్రం నొప్పి లేకుండా, కొన్ని గంటల్లోనే అయిపోయే ఈ చికిత్స సమయంలో రోగి మెలకువగానే ఉంటారు. ఇందులో కోత ఉండదు కాబట్టి రక్తం పోదు, ఇన్ఫెక్షన్లు రావు, జనరల్ ఎనస్థీషియా ఇవ్వక్కర్లేదు. చాలామంది రోగులు అదేరోజు ఇంటికి వెళ్లి, పనులు చేసుకోవచ్చు.
రోగులకు ప్రయోజనాలు..
మెదడు శస్త్రచికిత్సలకు ప్రత్యామ్నాయంగా.. కోత, నొప్పి లేని పద్ధతిని గామా నైఫ్ అందిస్తుంది. దీనివల్ల రోగులకు సమస్యలుండవు, వేగంగా కోలుకుంటారు. ఇప్పటివరకు ఈ విధానంలో ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలకు మంది చికిత్స పొందారు. కొన్నిరకాల మెదడు కణితులకు, న్యూరాల్జియా లాంటి సమస్యలకు ఇది 90 శాతం విజయాన్ని అందిస్తుంది. ఇందులో మిల్లీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో రేడియేషన్ అందిస్తారు. సగటున 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు చికిత్స అందిస్తారు. ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదు. చికిత్స అనంతరం 24 నుంచి -48 గంటల్లోనే రోగులు తమ పనులు చేసుకుంటారు.