21 July, 2026 | 11:28 AM

ముగ్గురు విద్యార్థులతోనే నెట్టుకొస్తున్న ప్రభుత్వ బడి

21-07-2026 01:12 AM
  1. చిన్న వాంకిడి ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థుల కొరత
  2. ఒకే ఉపాధ్యాయుడిపై అన్ని బాధ్యతలు

వాంకిడి, జూలై 20 (విజయక్రాంతి): కుమ్రం భీంఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని చిన్న వాంకిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కొర తతో వెలవెలబోతోంది. ఒకప్పుడు గ్రామ పిల్లలతో కళకళలాడిన ఈ పాఠశాల లో ప్రస్తుతం కేవలం ముగ్గురు విద్యార్థులు మా త్రమే చదువు కుంటుండడం ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలోని ఎక్కువ మంది తల్లి దండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గిపోతోంది.

పాఠశాలలో మరుగుదొడ్లు, వంటశాల, తాగునీటి సౌకర్యం వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఉచిత పాఠ్యపుస్తకాలు,యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలు కల్పిస్తు న్నప్పటికీ తల్లిదండ్రుల ఆసక్తి మాత్రం ప్రైవేట్ విద్యవైపే ఉండడం గమనార్హం.ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల పోస్టులు ఉండగా, ఒక మహిళా ఉపాధ్యాయురాలు డిప్యూటేష్ప మరో మండలానికి వెళ్లడంతో ప్రస్తుతం ఒకే ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. ముగ్గురు విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు బోధించడంతో పాటు హాజరు నమోదు, మధ్యాహ్న భోజన పథకం పర్యవేక్షణ, పాఠశాల పరిపాలనా బాధ్యతలను కూడా ఆయనే నిర్వహించాల్సి వస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం పెంపొందేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు చొరవ చూపి విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వ పాఠశాలల ఉనికే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.