21 July, 2026 | 12:18 PM

అందరికీ అందుబాటులో గోండి..

21-07-2026 01:14 AM
  1. ఐటీడీఏ, హైదరాబాద్ త్రిబుల్ ఐటీతో కలిసి కొత్త యాప్ ఆవిష్కరణ..
  2. నేడే గోండు భాషా 11వ వార్షికోత్సవం..

ఉట్నూర్, జూలై 20 : అడవి బిడ్డల సమస్యలను మాతృభాష గోండి భాషతో పాటు కొలం భాషలో అధికారులకు చెప్పుకునే అవకాశం దక్కనుంది. అధికారులకు వారు తమ భాషలో చెప్పే సమస్యలను క్షణాల్లో తెలుగులో అనువదించే కొత్త యాప్ ను ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందం హైదరాబాద్ లోని త్రిబుల్ ఐటీ సహకారంతో రూపలో కల్పన చేస్తున్నారు. ఆశా సంకల్పంలో భాగంగా గొండి భాష అందుబాటులో ఉండేలా... వారి సమస్యలను సులువుగా చెప్పుకునే విధంగా ఈ యాప్ సహకరిస్తుంది. కృత్రిమ మేధస్సు ( ఏఐ ) సహకారంతో స్వేచ్ఛ యాప్ ఆవిష్కరించారు. గత నెల రోజుల నుంచి ఉట్నూర్ ఐటీడీఏలో ముమ్మరంగా కొనసాగుతుంది.

ఆగస్టు నెల వరకు పూర్తి...

గోండు భాషా సమన్వయకర్త తొడసం దేవరావు ఆధ్వర్యంలో నిపుణులు అందజేస్తున్న సాంకేతికతో గోండ్వానా రాయి సెంటర్లో సార్ మేడిలు, గోండ్ వాన పటేల్ లు, పెద్దల సమక్షంలో ఉట్నూర్ ఐటిడిఏ పరిధిలోని కొమరం భీము కాంప్లెక్స్లో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వచ్చే ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం నాటికి ఈ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో గోండి భాషను తెలుగు భాషలో అనువదించుటకు రూపకల్పన ముమ్మరంగా జరుగుతుంది.

గోండు.. కొలం భాషలు అధికారులకు అర్థమయ్యేలా: మంద మకరందు, ఐటీడీఏ పీవో, ఉట్నూర్

అదిలాబాద్ జిల్లాలోని గోండులు, కొలం గిరిజనుల సమస్యల పరిష్కారాని కోసం అధికారుల వద్దకు వచ్చిన సమయంలో వారి మాతృభాష అధికారులకు అర్థం కాక సమస్యలు పరిష్కారం కావడం లేదని గుర్తించడం జరిగినట్లు ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు.

ఏజెన్సీ ప్రాంతంలోని గోండులు, కొలం గిరిజనులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమయంలో వారి మాతృభాషలో వివరించే సమస్యను అధికారులు గుర్తించే విధంగా ఏఐ తో అనుసంధానం చేసి సమస్యలను పరిష్కరించుటకు సులభతరమైన మార్గంగా గుర్తించాం. అందుకే గోండు, కొలం భాషలో అనుభవం అనుభవం ఉన్న వారితో పాటు హైదరాబాదులోని త్రిబుల్ ఐటీ అధ్యాపకులతో కలిసి ఏఐలో అనుసంధానం చేస్తున్నాము. ఈ ప్రక్రియ ఆగస్టులో పూర్తి అవుతుందని అన్నారు.