పదో తరగతి ఫలితాల్లో శత శాతం ఉత్తీర్ణత
చారకొండ: పదో తరగతి ఫలితాల్లో చారకొండ మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ప్రైవేటు పాఠశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా మండలంలోని రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఒక కేజీబీవీ పాఠశాల వంద శాతం ఫలితాలను సాధించి రికార్డు సృష్టించాయి. చారకొండ జడ్పీహెచ్ఎస్ నుంచి 67 మంది విద్యార్థులు, జూపల్లి జడ్పీహెచ్ఎస్ నుంచి 24 మంది విద్యార్థులు, కేజీబీవీ నుంచి 43 మంది విద్యార్థినులు పరీక్షలకు హాజరు కాగా విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించారు.
కేజీబీవీకి చెందిన విద్యార్థిని ఎన్. ఉషారాణి 559 మార్కుల సాధించి మండల టాపర్ గా నిలిచారు. చారకొండ జడ్పీహెచ్ఎస్‌కు చెందిన విద్యార్థిని పొలం సిందూజ 555 మార్కులతో మండల ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ, నాణ్యమైన విద్యాబోధనతో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ఎంఈవో ఝాన్సీరాణి, జీహెచ్ ఎం భగవాన్ రెడ్డి, ఎస్ఓ మంజుల, ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు.






