6 June, 2026 | 2:46 AM

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

06-06-2026 12:26 AM

రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య

నిర్మల్ జూన్ 5 (విజయ క్రాంతి): దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు.  శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, దివ్యాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిం చారు.  ఈ కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ చైర్మన్ మాట్లాడుతూ, దివ్యాంగులు తమ సొంత కాళ్ల మీద నిలబడేలా ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందని అన్నారు. దివ్యాంగుల కొరకు రాష్ట్రంలో ప్రత్యేకంగా స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిందన్నారు. 11 వేల దివ్యాంగ పొదుపు సంఘాల్లో దాదాపు 80 వేల మంది దివ్యాంగులు లబ్ధిపొందుతుందన్నారు. దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ విషయంలో ఉన్న కఠిన నిబంధనలు సవరించామని, దీని ద్వారా ఎక్కువ మంది దివ్యాంగులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు.

ఆరు సంవత్సరాల లోపు దివ్యాంగుల ఆరోగ్యం మెరుగు కోసం బాల భరోసా కేంద్రాలు  ఏర్పాటు చేశామన్నారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, దివ్యాంగుల ఉన్నతికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని, ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాలు ఉపయోగించుకొని, దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందు కు సాగాలన్నారు.

దివ్యాంగుల కొరకు స్కూటీలు, అడ్వానస్డ్ చక్రాల కుర్చీలు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లు, వినికిడి యంత్రాలు, తదితర పరికరాలు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుందని అన్నారు. వీటి ద్వారా దివ్యాంగులకు ఎంతో మేలు కలుగుతుందని చెప్పారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అర్హులైన పలువురు దివ్యాంగులకు కార్పొరేషన్ చైర్మన్, కలెక్టర్ లు ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్ లు, అడ్వానస్డ్ చక్రాల కుర్చీలు అందించారు.

  అనంతరం కలెక్టర్ ప్రాంగణంలో కార్పొరేషన్ చైర్మన్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ లు కలిసి 38 మంది దివ్యాంగ లబ్ధిదారులకు ప్రత్యేక స్కూటీలు అందించారు.  ఈ కార్యక్రమంలో మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ అధికారి వినూత్న, ఇతర అధికారులు, దివ్యాంగులు, తదితరులు పాల్గొన్నారు.