3 April, 2026 | 6:06 PM

ఘనంగా విశ్వ కళ్యాణం మ్యాట్రిమోనీ సేవలు ప్రారంభించిన ప్రభుత్వ విప్

03-04-2026 04:30 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): విశ్వబ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన “విశ్వకళ్యాణం మ్యాట్రిమోనీ” సేవలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు  ఘనంగా ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల గ్రామంలోని మహమ్మాయి దేవాలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. చివరిరోజు జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, స్థానిక ప్రజలు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ రమణారావు మాట్లాడుతూ ఆధునిక డిజిటల్ యుగంలో సంప్రదాయాలను కాపాడుతూ, సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ మ్యాట్రిమోనీ ప్లాట్‌ఫాం రూపుదిద్దుకుందని తెలిపారు.

విశ్వబ్రాహ్మణ యువతకు సరైన జీవితభాగస్వాములను సులభంగా కనుగొనేందుకు ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. డిజిటల్ విధానంలో ప్రారంభమైన “విశ్వకళ్యాణం మ్యాట్రిమోనీ” ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న విశ్వబ్రాహ్మణుల మధ్య అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని, సమాజ ఐక్యతకు ఇది దోహదం చేస్తుందని విజయ రమణారావు  అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం విశ్వబ్రాహ్మణ సమాజంలో కొత్త ఆశలను నింపడంతో పాటు, సాంకేతికతను వినియోగించి సామాజిక సేవలను మరింత విస్తరించే దిశగా ఒక మంచి ముందడుగుగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్ రావు, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్లు బిరుదు రాధాకృష్ణ, నూగిల్ల మల్లయ్య, చిన్నకల్వల, చిన్నబోంకురు సర్పంచులు ఏరుకోండ స్రవంతి రమేశ్, అబ్బోజు కవిత బ్రహ్మచారి, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు కందుకూరి ప్రకాష్ రావు (పెద్దన్న), మాట్రిమోనీ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.