29 August, 2026 | 12:09 AM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆత్మీయ ప్రతీక.. రాఖీ పౌర్ణమి

28-08-2026 10:25 PM

బెజ్జంకి: అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి పండుగను బెజ్జంకి మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే పండుగ సందడి నెలకొనగా.. ఆడపడుచులు తమ సోదరుల ఇళ్లకు చేరుకుని ప్రేమతో రాఖీలు కట్టారు. సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి.. జీవితాంతం ప్రేమగా, ఆప్యాయంగా తోడుగా ఉండాలని ఆకాంక్షించారు. సోదరులు కూడా తమ సోదరీమణుల పట్ల ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని హామీ ఇస్తూ ఆప్యాయంగా కానుకలు అందజేశారు. దీంతో ప్రతి ఇంటా ఆనందం, ఆత్మీయత వెల్లివిరిసింది.

రాఖీ దారంలో ముడిపడేది కేవలం మణికట్టు కాదు.. జీవితాంతం నిలిచే అనుబంధం. కాలం మారినా, దూరాలు పెరిగినా అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలు చెరిగిపోవని చాటుతూ రాఖీ పౌర్ణమి వేడుకలు కుటుంబాల్లో సంతోషాన్ని నింపాయి. పండుగ సందర్భంగా మార్కెట్లలో రాఖీలు, స్వీట్లు, పండ్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సందడి నెలకొంది. సోదరసోదరీమణుల అనురాగ బంధాన్ని మరింత బలపరిచేలా రాఖీ పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.