రైతు సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది
పసుపు విలువ ఆధారిత ఉత్పత్తులతో రైతుల ఆదాయం పెంచాలి
పసుపు రైతులతో నిర్వహించిన ముఖాముఖిలో రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా
'సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను ప్రారంభించిన గవర్నర్
బోధన్,(విజయ క్రాంతి): రైతుల సంక్షేమమే రాష్ట్ర, దేశ సంక్షేమమని రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. పసుపు సాగులో ఆధునిక సాంకేతికత, సహజ వ్యవసాయ పద్ధతులు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, బలమైన మార్కెట్ అనుసంధానంతో రైతుల ఆదాయాన్ని పెంచాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్‌లోని జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయంలో మంగళవారం పసుపు రైతులతో ముఖాముఖి నిర్వహించారు. రైతుల సమక్షంలో ''సునహరి మిట్టి అభియాన్', మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలను గవర్నర్ ప్రారంభించారు. ఉత్తమ రైతు సంఘాలకు గవర్నర్ మెమంటో లు అందించి అభినందించారు.
అనంతరం గవర్నర్ పసుపు రైతులను ఉద్దేశించి మాట్లాడారు
నిజామాబాద్‌కు పసుపు సాగులో ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ అన్నారు. సారవంతమైన నేలలు, రైతుల కష్టంతో ఈ ప్రాంతం దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పత్తి కేంద్రంగా ఎదిగిందన్నారు. ఇక్కడ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయం ఏర్పాటు కావడం ఈ ప్రాంత రైతుల చిరకాల ఆకాంక్షకు ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రత్యేక చొరవ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆశీస్సులతో ఇది సాకారం అయ్యిందన్నారు. సాగును లాభదాయకంగా మార్చేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు.
పసుపు కేవలం వ్యవసాయ ఉత్పత్తి మాత్రమే కాదని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయం, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, నిత్యజీవితంతో ముడిపడిన విలువైన సంపద అని గవర్నర్ పేర్కొన్నారు. భారతదేశ వ్యవసాయ వారసత్వానికి పసుపు ప్రతీకగా నిలుస్తోందన్నారు.
భారత్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద పసుపు ఉత్పత్తిదారుగా కొనసాగించడంతో పాటు.. పసుపు ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయడమే జాతీయ పసుపు బోర్డు లక్ష్యమని గవర్నర్ అన్నారు. పసుపు పండించే రైతుకు కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించడంతో పాటు.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత పసుపుకు ప్రత్యేక గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
రైతులకు నాణ్యత పెంపు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటకోత అనంతర నిర్వహణపై శిక్షణ అందించడం అభినందనీయమన్నారు. బాయిలర్లు, పాలిషర్లు, చిన్నతరహా ప్రాసెసింగ్ యూనిట్లు రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు విలువ ఆధారిత ఉత్పత్తుల దిశగా దోహదపడతాయని తెలిపారు.
సహజ వ్యవసాయం, ఎగుమతుల ప్రోత్సాహానికి దోహదపడే దూరదృష్టితో ‘సునహరీ మిట్టీ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. రసాయన ఎరువులు, ఇతర ఇన్‌పుట్లపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా నేల సారాన్ని కాపాడటంతో పాటు.. పర్యావరణ పరిరక్షణ, సాగు వ్యయాన్ని తగ్గించేందుకు సహజ వ్యవసాయం తోడ్పడుతుందని అన్నారు.
అవశేష రహిత, నాణ్యమైన పసుపుకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని.. నాణ్యతకు ప్రాధాన్యమిస్తే రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు విదేశీ మార్కెట్లకు చేరుకునే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
మార్కెట్ అనుసంధాన కార్యక్రమాలు రైతులను నేరుగా దేశంలోని ప్రముఖ ఎగుమతిదారులతో అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తాయని గవర్నర్ అన్నారు. మార్కెట్ అవసరాలు, నాణ్యతా ప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు.. రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు మార్గదర్శకత్వం అందించాలని సూచించారు.
రైతులు, శాస్త్రవేత్తలు, ఎగుమతిదారులు, పరిశ్రమలు, ప్రభుత్వాలు సమష్టిగా పనిచేస్తే భారత పసుపును ఆసియా, యూరప్, అమెరికా మార్కెట్లలో మరింత బలోపేతం చేయవచ్చని గవర్నర్ అన్నారు. రైతులు కేవలం పంట ఉత్పత్తిదారులు మాత్రమే కాదని.. దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని గవర్నర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే దేశ సౌభాగ్యానికి పునాది అన్నారు.
ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని, నాణ్యమైన పంటను పండిస్తూ, సమష్టి మార్కెటింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. “అన్నదాత సుఖీభవ” స్ఫూర్తితో రైతు సంపన్నుడిగా, నేల ఆరోగ్యంగా, ప్రపంచ మార్కెట్‌లో భారత్ అగ్రగామిగా నిలిచే వ్యవసాయ వ్యవస్థను నిర్మించాలి అని గవర్నర్ ఆకాంక్షించారు. ఎంపీ శ్రీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఈ ప్రాంత పసుపు రైతుల నాలుగు దశాబ్దాల కలను నిజామాబాద్ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుతో కేంద్రం నెరవేర్చిందన్నారు. బోర్డు ఏర్పాటు తో పసుపు రైతులకు అన్ని విధాలుగా ప్రయోజనం చేకూరుతుందన్నారు.
పసుపు క్వింటాలు ఇచ్చే రేటు గతం కంటే పెరిగిందన్నారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం దాన కిషోర్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నగర మేయర్ ఉమారాణి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పి. రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శి భవానీ , నిజామాబాద్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య లు పాల్గొన్నారు.






