గ్రేస్ మార్కులు హక్కేమీ కాదు
- ఎంసీఐ నిబంధనలు సరైనవే
హైకోర్టు తీర్పు
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): పాత నిబంధనల ప్రకారం గ్రేస్ మార్కులు పొందే హక్కు విద్యార్థులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అదేవీ చట్టబద్ధమైన ప్రాథమిక హక్కు కాదని స్పష్టం చేసింది. ఎంసీఐ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాకే పరీక్షలు నిర్వహించారని, పాత రూల్స్ ప్రకారం గ్రేస్ మార్కులు కలపపాలని కోరే హక్కు విద్యార్థులకు ఉండబోదని తీర్పు చెప్పింది. పాత నిబంధనల ప్రకారం గ్రేస్ మార్కులు కలిపే విధంగా ఉత్తర్వులు జారీ చేయబోమని వెల్లడించింది. అయితే ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల విజ్ఞప్తిని ఎంసీఐ, యూనివర్సిటీలు పరిశీలించాలని సూచించింది.
గ్రేస్ మార్కులను తొలగిస్తూ ఎంసీఐ రూపొందించిన నిబంధనలను సవాల్ చేస్తూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన ఎనిమిది వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే, జస్టిస్ జె అనిల్ కుమార్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపి తీర్పు చెప్పింది. 2022లో నీట్ పరీక్షలు రాసి 2022 ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరారు. 2023 ఆగస్టు 1న పాత నిబంధనల స్థానంలో ఎంసీఐ కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పాత నిబంధన ప్రకారం విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఒకదానిలో ఫెయిల్ అయినట్లయితే 5 మార్కులను కలిపే అధికారం యూనివర్సిటీకి ఉండేది. పాత నిబంధనల కింద పరీక్షలు రాశామని, కొత్త నిబంధనలను గతానికి వర్తింపజేయడం చెల్లదని, దీనివల్ల తాము నష్టపోతున్నామని పిటిషనర్ల వాదన.
2023 ఆగస్టులో నిబంధనలు అమల్లోకి వచ్చాయని, నవంబరులో పరీక్షలు జరిగాయని ఎంసీఐ తెలిపింది. ఇరుపక్షాల వాదనల తర్వాత హైకోర్టు, వైద్యవిద్యలో ఉన్నత విద్యా ప్రమాణాల నిమిత్తం నేషనల్ మెడికల్ కమిషన్ చట్టాన్ని తీసుకువచ్చిందని గుర్తు చేసింది. ఈ క్రమంలో కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిందని, ఈ విధమైన అధికారం సెక్షన్ 10, 24, 25, 57 ప్రకారం ఎంసీఐకి ఉందని తీర్పులో పేర్కొంది. ఇక్కడ ఎలాంటి నిబంధనలకు ఉల్లంఘన జరగలేదని తేల్చింది. విద్యార్థులు ఎంబీబీఎస్ నాలుగేళ్లలో నిబంధనల మార్పు ఉంటుందని స్పష్టం చేసింది. గ్రేస్ మార్కుల తొలగిస్తూ తీసుకువచ్చిన కొత్త నిబంధనలు సరైనవేనని పేర్కొంది. పిటిషన్లపై విచారణను మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.






