ధాన్యం సేకరణ పూర్తి
51.07 లక్షల టన్నులు కొనుగోలు
రూ.11,055 కోట్ల చెల్లింపులు
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో ధాన్యం సేకరణ పూర్తియింది. మార్చి 25న ప్రారంభించిన కొనుగోలు కేంద్రాలను మూడు నెలల పాటు నిర్వహించి కేంద్రాలను మూసివేశారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 51.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 8.60 లక్షల మంది రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.11,055 కోట్లు చెల్లించింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులను బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభించింది. గత ప్రభుత్వంలో ఏటా ఏప్రిల్‌లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేవి.
ఈసారి రెండు వారాల ముందే ప్రారంభించింది. యాసంగి ధాన్యం కొనుగోలుకు రాష్ట్రవ్యాప్తంగా ఈసారి 7,148 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా వీటిలో 6,345 కేంద్రాల్లో కొనుగోలు ఎక్కువ మొత్తంలో జరిగాయి. ఆలస్యంగా పంటలు వేసిన రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన చోట్ల కేంద్రాలు తెరిచి వరి కొనుగోలు చేశారు. ఈ ఏడాది దాదాపు 75.40 లక్షల టన్నుల వడ్లు కొనుగోలు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. కానీ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ ధర రావటం, ప్రైవేటు వ్యాపారులు పోటీ పడి మంచి ధరకు కొనుగోలు చేయడంతో కేంద్రాలకు వచ్చే ధాన్యం అంచనా తగ్గింది. మే నెలలో అకాల వర్షాలు రావడంతో వడ్లు తడిసిపోవడంతో కొందరు రైతులు సమీపంలోని రైస్ మిల్లర్లకు అమ్మకాలు చేశారు.
అధికారులు ధాన్యం తూకం వేసేందుకు సవాలక్ష కొర్రీలు పెట్టి క్వింటాల్ 4 నుంచి 5 కిలోలు కోత పెట్టడంతో కేంద్రాల వద్దకు వెళ్లేందుకు విముఖత చూపారు. అదే ప్రైవేటు వ్యాపారులు కల్లాల వద్దకు వచ్చి ఒకటి రెండ్రు రోజుల్లో తూకం వేసి వెంటనే నగదు చెల్లించడంతో అన్నదాతలు అటువైపు మొగ్గుచూపినట్లు జిల్లాల అధికారులు పేర్కొన్నా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఈ సారి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ పక్కాగా ఏర్పాట్లు చేసింది. ఈదురుగాలులు, అకాల వర్షాలకూ రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్త లు చేపట్టింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేసింది. ఈసారి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణలో జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, సూర్యాపేట, యాద్రాద్రి భువనగిరి, సంగారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయి.






